అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | జీఆర్ కాలనీలో ఇన్‌చార్జి మంత్రి సీతక్క (in-charge minister Seethakka) తూతూమంత్రంగా పర్యటించారని మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని, మీ ప్రభుత్వ హయాంలో విపత్తుల వేళ ఎవరినైనా పరామర్శించారా అని డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావు (Kailas Srinivas Rao) ప్రశ్నించారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
బీఆర్‌ఎస్ (BRS) హయాంలో పదేళ్లలో ఎన్నో విపత్తులు జరిగినా.. ఒక్కరోజు కూడా స్పందించలేదని ఆరోపించారు. కనీసం నష్టపరిహారం అందించలేదన్నారు. ప్రభుత్వం, ప్రభుత్వ అధికార యంత్రాంగం సకాలంలో స్పందించి చర్యలు చేపట్టడంతో ప్రాణ నష్టం తప్పిందన్నారు. విపత్తు సమయంలో రాజకీయాలు చేయకుండా సహాయం చేయాలన్న జ్ఞానం కూడా లేకుండా పోయిందని ఘాటుగా స్పందించారు. సీఎం స్వయంగా వచ్చి పర్యవేక్షించి రివ్యూ చేయాలనుకున్నారని, హెలికాప్టర్‌లో వచ్చి ఏరియల్ సర్వే చేశారని, వాతావరణం అనుకూలంగా లేనందున కామారెడ్డిలో (Kamareddy) దిగలేకపోయారన్నారు.
హుటాహుటిన మంత్రులు, అధికారులను అప్రమత్తం చేసి జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎస్డీఆర్‌ఎఫ్ (SDRF), ఎన్డిఆర్‌ఎఫ్ బృందాలు (NDRF Teams), పోలీస్, రెవెన్యూ, విద్యుత్ శాఖ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో పాటు షబ్బీర్ అలీ ఫౌండేషన్ ప్రతినిధులు యుద్ధ ప్రాతిపదికగా సహాయక చర్యలు చేపట్టి ప్రాణనష్టం జరగకుండా కష్టపడ్డారని అన్నారు. ప్రతిరోజు పట్టణంలో 3 వేల మందికి, మండలాల్లో 2వేల మందికి అన్నదానం చేశామన్నారు. తక్షణ సహాయం కింద ఒక్కొక్క ఇంటికి 11,500 ప్రకటించి విడుదల చేశారని తెలిపారు. షబ్బీర్ అలీ (Shabbir Ali) అభ్యర్థన మేరకు ఎమ్మెల్సీల బృందం పర్యటించి అధికారులు, మంత్రులు పర్యటించారని, సర్వేలు నిర్వహించి జరిగిన నష్ట అంచనాలు ప్రభుత్వానికి పంపించామన్నారు. త్వరలో నష్టపోయిన వారందరికీ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు.