అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Womens World Cup | మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో టీమిండియా విజయకేతనం ఎగరవేసిన తర్వాత దేశవ్యాప్తంగా అభినందనల వెల్లువ కొనసాగుతోంది. మహిళా క్రీడాకారిణులు చరిత్ర సృష్టించడంతో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు తమదైన రీతిలో అభినందనలు తెలుపుతున్నారు.
ఈ క్రమంలో గుజరాత్ (Gujarat)లోని సూరత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, రాజ్యసభ ఎంపీ గోవింద్ ఢోలాకియా (Govind Dholakia) అద్భుత నిర్ణయం తీసుకున్నారు. గోవింద్ ఢోలాకియా ప్రకటించిన ప్రకారం, ప్రపంచకప్ విజేతలైన భారత మహిళల జట్టులోని ప్రతి సభ్యురాలికీ వజ్రాల నక్లెస్‌లు (Diamond Necklace) మరియు సోలార్ ప్యానెళ్లు గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించిన ఆయన – “మన దేశపు గర్వకారణమైన ఈ అమ్మాయిలకు ఇది నా చిన్న కానుక” అని పేర్కొన్నారు.
Womens World Cup | ముందుగానే ఇచ్చిన హామీ
ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఢోలాకియా, BCCI ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాకు లేఖ రాసి – “టీమిండియా గెలిస్తే ప్రతి ఒక్కరికి డైమండ్ నెక్లెస్‌లు కానుకగా ఇస్తాను” అని ప్రకటించారు. ఇప్పుడు టీమ్ చాంపియన్‌గా నిలవడంతో ఆయన మాట నిలబెట్టుకున్నారు. ఇది తొలిసారి కాదు. గోవింద్ ఢోలాకియా ఇప్పటికే పలు సందర్భాల్లో తన సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ఇళ్లు, కార్లు, నగదు బహుమతులు ఇచ్చి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. సమాజ సేవలో, దాతృత్వ కార్యక్రమాల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక ఫైనల్‌లో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేసిన క్రాంతి గౌడ్‌కి మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.1 కోటి నగదు బహుమతి ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆమె ప్రతిభను కొనియాడుతూ – “ఈ విజయం దేశానికి గర్వకారణం” అని అన్నారు.
టీమిండియా (Team India) మహిళల జట్టు చారిత్రక విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు కొనసాగుతున్నాయి. అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా, గోవింద్ ఢోలాకియా ప్రకటించిన ఈ వజ్రాల బహుమతులు క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. మహిళల జట్టుని చూసి దేశం గర్వపడుతుంది. రానున్న రోజులలో ఈ జట్టు మరిన్ని అద్భుతాలు సృష్టించడం ఖాయం అంటున్నారు.
