అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Dhurandhar Movie | బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘ధురంధర్’(Dhurandhar). ఈ మూవీ షూటింగ్ సమయంలో అపశృతి చోటుచేసుకుంది.
విషపూరిత ఆహారం కారణంగా 120 మందికిపైగా యూనిట్ సభ్యులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనతో చిత్రయూనిట్‌లో కలకలం రేగింది. ఆదివారం రాత్రి డిన్నర్ తరువాత పలువురు యూనిట్ సభ్యులు వాంతులు, విరోచనాలు, తలనొప్పి, కడుపునొప్పి వంటి లక్షణాలతో బాధపడుతూ కనిపించడంతో వెంటనే లేహ్‌లోని ఎస్ఎన్ఎమ్ హాస్పిటల్(SNM Hospital)కి తరలించారు. పరిస్థితి విషమించడంతో మరి కొందరు సభ్యులు కూడా అదే సమస్యతో ఆసుపత్రిలో చేరారు.
Dhurandhar Movie | లోపం ఎక్కడ?
వైద్యులు బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఎవరికి ప్రాణాపాయం లేదని, త్వరలోనే వారు కోలుకుని డిశ్చార్జ్ అవుతారని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసిన చిత్రబృందం, ఈ ఘటన జరిగిన ప్రదేశం నుంచి ఆహార శ్యాంపిళ్లను సేకరించి విశ్లేషణ చేశారు. అయితే ఫుడ్ పాయిజనింగ్ (Food Poison) జరిగినట్లు ఆస్పత్రి డాక్టర్లు చెబుతున్నారు. ఏ పదార్థంలో లోపం జరిగిందో తెలుసుకోవడానికి ఆహారం నమూనాలను పరీక్షలకు పంపాం. బాధితుల ఆరోగ్యమే ప్రాధాన్యం. అన్నీ సమీక్షించాకే మళ్లీ షూటింగ్ మొదలుపెడతాం, అని చిత్రయూనిట్ ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది.
ఆదిత్య ధార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రణ్‌వీర్ సింగ్‌తో పాటు ఆర్.మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుమారు 600 మందికిపైగా సభ్యులతో లేహ్ ప్రాంతంలో షూటింగ్ జరుగుతోంది. ఫుడ్ పాయిజన్ వలన ఒక్కసారిగా గందరగోళం పరిస్థితి ఏర్పడింది. ఇక ‘యూరీ’, ‘ఆర్టికల్ 370’ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత ఆదిత్య ధార్ రూపొందిస్తున్న ‘ధురంధర్’ భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది. జీ స్టూడియో, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఈ చిత్రం రూపొందుతోంది.
