అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | నులిపురుగుల నివారణ మాత్రలను 19 ఏళ్ల లోపు వయసు కలిగిన వారందరికీ తప్పనిసరిగా వేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని (National Deworming Day) పురస్కరించుకొని సోమవారం బోర్గాం ( పి) ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో నాలుగు లక్షల మంది 19 ఏళ్ల వయసులోపు బాల బాలికలు ఉన్నారన్నారు. ఒక్కరు కూడా తప్పిపోకుండా అందరికీ మాత్రలు వేసేందుకు ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించాలి. ఒకవేళ ఎవరైనా గైర్హాజరయితే ఈ నెల 18న చేపట్టే మలి విడతలో పంపిణీ చేయాలన్నారు.
నులిపురుగుల వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపించడం, మందబుద్ధి, రక్తహీనత, చదువుపై ఏకాగ్రత కోల్పోవడం వంటి రుగ్మతలకు లోనవుతారన్నారు. దీనిని నివారించేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, ఆగస్టులో నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేస్తోందన్నారు. ఈ మాత్ర వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని, ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని వివరించారు. బోర్గాం( పి) ప్రభుత్వ ఉన్నత పాఠశాల (Government High School) నిర్వహణ గురించి ప్రజల్లో ఎంతో మంచి అభిప్రాయం ఉందన్నారు. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించేందుకు పోటీపడతారని కలెక్టర్ అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని అవసరమైన వసతులు, మౌలిక సదుపాయాల కల్పన కోసం జిల్లా యంత్రాంగం తరపున ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీ, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్ తదితరులు పాల్గొన్నారు.