అక్షరటుడే, వెబ్డెస్క్ : Tirumala | తిరుమలలో కొలువైన వేంకటేశ్వర స్వామి (Venkateswara Swamy) వారి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. సెలవు రోజులు, ప్రత్యేక పర్వ దినాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ప్రస్తుతం వరుసుగా మూడు రోజులు సెలవులు రావడంతో తిరుమల కొండకు భక్తులు పోటెత్తారు. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం, శనివారం శ్రీకృష్ణాష్టమి, ఆదివారం వరుస సెలవులు రావడంతో స్వామి వారి దర్శనానికి భారీగా భక్తులు (Devotees) వచ్చారు.
Tirumala | టికెట్ల కోసం తోపులాట
తిరుమల శ్రీవాణి ట్రస్ట్ దర్శన టిక్కెట్ల (Srivani Tickets) కౌంటర్ దగ్గర శుక్రవారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీవాణి దర్శన టికెట్లను ఉదయం 10:30 గంటలకు జారీ చేస్తామని అధికారులు ప్రకటించారు. అయితే శుక్రవారం రాత్రి నుంచే భారీ సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో అధికారులు అర్ధరాత్రి టికెట్లు విక్రయించారు. దీంతో టికెట్లు దొరకని భక్తులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. అన్నమయ్య భవనం ఎదుట భక్తులు నిరసన చేపట్టగా.. విజిలెన్స్ సిబ్బంది వారిని సముదాయించి పంపించారు.
Tirumala | దర్శనానికి 30 గంటల సమయం
తిరుమలకు భక్తులు భారీగా తరలి రావడంతో దర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతుంది. తిరుమల కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. నారాయణగిరి షెడ్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam Q Complex) లు నిండిపోవడంతో ఆక్టోపస్భవనం నుంచి భక్తులను క్యూలైన్లోకి పంపిస్తున్నారు. శ్రీవారి భక్తులకు ఇబ్బందులు కల్గకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. అధికారులు అన్న ప్రసాదాలు.. నీరు.. పాలు అందిస్తున్నారు. కాగా శుక్రవారం శ్రీవారికి రూ.3.53 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.