HomeజాతీయంSabarimala | శబరిమలలో భారీగా భ‌క్తుల‌ రద్దీ.. మహిళా భక్తురాలి మృతి , సౌకర్యాలపై భక్తుల...

Sabarimala | శబరిమలలో భారీగా భ‌క్తుల‌ రద్దీ.. మహిళా భక్తురాలి మృతి , సౌకర్యాలపై భక్తుల అసంతృప్తి

గతంలో ఎప్పుడూ లేనంతగా భక్తులు శబరిమలకు తరలివస్తున్నారు. మండల–మకరవిలక్కు తీర్థయాత్ర ప్రారంభం కావడంతో అయ్యప్ప దర్శనం కోసం భక్తులు భారీగా పోటెత్తారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sabarimala | శబరిమల అయ్యప్ప ఆలయం (Sabarimala Ayyappa Temple)లో భ‌క్తుల రద్దీ భారీగా నెలకొంది. భక్తుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడంతో దర్శనం కోసం వేచి ఉండే సమయం 10 గంటలకు పైగా పెరిగింది. ఈ తీవ్ర రద్దీ మధ్య ఓ మహిళా భక్తురాలు స్పృహ కోల్పోయి మరణించిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది.

ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు చైర్మన్ కె. జయకుమార్ వివరాల ప్రకారం, 58 ఏళ్ల మహిళా భక్తురాలు దర్శనం కోసం క్యూలో వేచి ఉండగా స్పృహ తప్పి కుప్పకూలింది. వెంటనే వైద్య సిబ్బంది పరిశీలించగా ఆమె అక్కడికక్కడే మరణించినట్లు నిర్ధారించారు. మృతురాలు కోజికోడ్ జిల్లా (Kozhikode District)లోని కోయిలాండికి చెందినట్టు తెలిపారు. ఆమె మృతదేహాన్ని దేవస్వం బోర్డు ఖర్చుతో అంబులెన్స్‌లో స్వగ్రామానికి పంపనున్నట్లు అధికారులు చెప్పారు.

Sabarimala | 10 గంటలకుపైగా క్యూలైన్లు

భారీ రద్దీ కారణంగా మధ్యాహ్నం పవిత్ర మెట్ల వద్ద తీవ్ర జనసమూహం ఏర్పడింది. పిల్లలు, వృద్ధులు తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యారు. పరిస్థితి అదుపులోకి తీసుకురావ‌డంలో పోలీసులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ రద్దీ నేపథ్యంలో ఆలయం మూసివేసే సమయాన్ని మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు ఒక గంట పాటు పొడిగించారు. అధికారులు ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా రోజుకు 70,000 మంది, డైరెక్ట్ బుకింగ్ ద్వారా 20,000 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తున్నప్పటికీ, నిన్న పెద్ద సంఖ్యలో భక్తులు (Devotees) ఆలయానికి చేరుకున్నారు. రోజుకు గరిష్టంగా లక్ష మంది భక్తులకు మాత్రమే దర్శనం అనుమతి ఉన్నప్పటికీ భక్తుల‌ రద్దీ పెరుగుతుండ‌డంతో ప‌రిస్థితి అదుపు తప్పే అవ‌కాశం ఉంది.

మరోవైపు భక్తులకు తాగునీరు, ఆహారం వంటి అవసరమైన సౌకర్యాలు లేవని విస్తృతంగా ఫిర్యాదులు వస్తున్నాయి. శబరిమల (Sabarimala)లో సరైన ఏర్పాట్లు చేయడంలో ప్ర‌భుత్వం విఫలమైందని కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. భక్తులు కూడా సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. శబరిమల సీజన్‌లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, సౌకర్యాల మెరుగుదలపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది