అక్షరటుడే, కామారెడ్డి : Shabbir Ali | కేంద్ర, రాష్ట్ర నిధులతో గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. కేంద్రం నుంచి రూ. 3వేల కోట్లు, రాష్ట్రం నుంచి రూ.3వేల కోట్లు రావాల్సి ఉందని, వాటితో అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
Shabbir Ali | సర్పంచ్ ఎన్నికల్లో..
సర్పంచ్ ఎన్నికల్లో (Sarpanch Elections) కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో గెలిచిన సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇందిరాచౌక్ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో షబ్బీర్ అలీ పాల్గొని గెలిచిన సర్పంచులకు అభినందనలు తెలిపారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Shabbir Ali | సగానికి పైగా కాంగ్రెస్ మద్దతుదారులే..
నియోజకవర్గంలో 102 పంచాయతీల్లో 58 సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారని, 26 మంది బీఆర్ఎస్ మద్దతుదారులు, 12మంది బీజేపీ మద్దతుదారులు, 5 స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారన్నారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఇచ్చిన హామీలు నెరవేర్చిందని, అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్తోనేనని ప్రజలు నమ్మి ఓటేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలంతా కాంగ్రెస్ వైపేనని మరోసారి నిరూపించారన్నారు.
Shabbir Ali | గంప గోవర్ధన్ స్వగ్రామంలో..
మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ (Former MLA Gampa Govardhan) స్వగ్రామంలో 30 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ మద్దతుదారుడు విజయం సాధించారని షబ్బీర్ అలీ తెలిపారు. అక్కడి ప్రజలు గంప గోవర్ధన్ నాయకత్వాన్ని కాదనుకుని కాంగ్రెస్ మద్దతుదారుడికి ఓటేశారని వ్యాఖ్యానించారు. కొన్నిచోట్ల కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు గెలిచినా వాళ్లు తమవారేనని చెప్పారు.
Shabbir Ali | కేటీఆర్ పారిపోయాడు..
జూబ్లీహిల్స్ ఎన్నికలు (Jubilee Hills Elections), సర్పంచ్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం అని చెప్పిన కేటీఆర్ పారిపోయారని షబ్బీర్అలీ విమర్శించారు. రాష్ట్రంలో 4వేల పైచిలుకు సర్పంచ్ స్థానాల్లో 2300లకు పైగా స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారని తెలిపారు. గెలిచిన సర్పంచ్ అభ్యర్థులపై అనేక బాధ్యతలు ఉన్నాయన్నారు. గ్రామాల్లో వారు ప్రజలకు ఇచ్చిన హామీలను త్వరలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
Shabbir Ali | అన్ని గ్రామాల్లో సమానంగా అభివృద్ధి
పార్టీలతో సంబంధం లేకుండా అన్ని గ్రామాలను సమానంగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ సలహాదారు స్పష్టం చేశారు. ఇతర పార్టీల మద్దతుతో గెలిచిన అభ్యర్థులను బలవంతంగా తమ పార్టీలోకి తీసుకోబోమని, వారే స్వచ్ఛందంగా వస్తే వద్దనేది లేదని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ, మండల అధ్యక్షుడు పండ్ల రాజు, శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.