అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Supreme Court | బీహార్ ఓటర్ జాబితా (Bihar voter list) నుంచి తొలగించిన 65 లక్షల మంది పేర్లను బహిరంగ పరచాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ఎన్నికల సంఘాన్ని (Central Election Commission) ఆదేశించింది. ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలను ఆగస్టు 19 లోపు బహిర్గతం చేయాలని, ఆగస్టు 22 నాటికి తమకు నివేదికను సమర్పించాలని సూచించింది.
బీహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) గురువారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఓటర్ జాబితా నుంచి తొలగించిన వారి పేర్లను వెబ్ సైట్లో వెల్లడించాలని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈసీని ఆదేశించింది. అదే సమయంలో వారి పేర్లను తొలగించడానికి గల కారణాలను కూడా అప్లోడ్ చేయాలని సూచించింది. ప్రతి ఓటరు దానిని యాక్సెస్ చేయగలిగేలా ఈ జాబితాను ప్రచారం చేయాలంది. విచారణను ఆగస్టు 22కు వాయిదా వేసింది.
Supreme Court | పారదర్శకత అవసరం..
ప్రజలు స్పష్టత లేదా దిద్దుబాటు కోరుకునేలా తొలగించబడిన 65 లక్షల మంది ఓటర్ల గురించి పారదర్శకత అవసరమని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఆ విషయాన్ని గరిష్ఠ సర్క్యులేషన్ ఉన్న స్థానిక భాషా వార్తాపత్రికలు (local language newspapers), దూరదర్శన్, ఇతర ఛానెళ్ల ద్వారా ప్రచారం కల్పించాలని సూచించింది. జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మందిలో 22 లక్షల మంది మరణించారని ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది. అయితే, 22 లక్షల మంది మరణించినట్లయితే దానిని బూత్ స్థాయిలో ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించింది. పౌరుల హక్కులు రాజకీయ పార్టీలపై (political parties) ఆధారపడి ఉండాలని తాము కోరుకోవడం లేదని వ్యాఖ్యానించింది.
జిల్లా ఎన్నికల అధికారికి సోషల్ మీడియా హ్యాండిల్ (social media handle) ఉంటే, అక్కడ కూడా నోటీసును ప్రదర్శించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ జాబితాలో పేరు ఉన్న వ్యక్తులు తమ పేరును ఎందుకు తొలగించకూడదో పేర్కొంటూ తమ ఆధారాలను జిరాక్స్ కాపీలతో సహా సమర్పించుకోవడానికి అవకాశాలు కల్పించాలని పేర్కొంది. ఓటరు జాబితా నుంచి తొలగించిన పేర్లను అన్ని పంచాయతీ భవనాలు, బ్లాక్ డెవలప్మెంట్, పంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డుపైనా ప్రదర్శించాలని, తద్వారా ప్రజలు జాబితాను మాన్యువల్‌గా యాక్సెస్ చేసుకునే వీలుంటుందని తెలిపింది.
Supreme Court | జాబితా వెల్లడికి అంగీకారం..
ఓటరు జాబితా నుంచి తొలగించబడిన వ్యక్తులను కారణంతో సహా బహిరంగపరచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఎన్నికల సంఘం అంగీకరించింది. విచారణ సందర్భంగా జిల్లా స్థాయిలో మరణించిన, వలస వచ్చిన లేదా మారిన ఓటర్ల జాబితాను పంచుకోవడానికి అంగీకారం తెలిపింది. అయితే, తొలగించిన ఓటర్లు దరఖాస్తు చేసుకుంటే తిరిగి అవకాశం కల్పించాలని, అందుకు ఆధార్ కార్డును (Aadhaar card) ప్రామాణికంగా తీసుకోవాలని కోర్టు సూచించింది. తొలగించబడిన ఓటర్ల జాబితాను కూడా బూత్ స్థాయి అధికారులు ప్రదర్శిస్తారని, ఓటు కోల్పోయిన వారు తమ గుర్తింపును నిరూపించుకోవడానికి ఎన్నికల కమిషన్ ఆధార్ కార్డును ఆమోదయోగ్యమైన పత్రంగా అంగీకరిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది.