అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Desk Journalists | జర్నలిస్ట్‌లకు అక్రిడిటేషన్ కార్డుల (accreditation cards) కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవో నంబర్ 252పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. డెస్క్ జర్నలిస్టుల (desk journalists) హక్కులను కాలరాసేలా ఈ జీవో ఉంది. దీంతో వారు పోరుబాట పట్టారు.
తెలంగాణలో కొత్త అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం ప్రభుత్వం (Telangana government) ఇటీవల మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్ట్‌లకు వేర్వేరు కార్డులు ఇస్తామని పేర్కొంది. గతంలో అందరికి ఒకే రకమైన కార్డులు ఉండేవి. తాజా ప్రభుత్వ నిర్ణయంపై డెస్క్ జర్నలిస్ట్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని మండి పడుతున్నారు. అందరికీ ఒకేరకమైన కార్డులు అందించాలని కోరుతున్నారు. లేకపోతే ఆందోళన చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే డెస్క్ జర్నలిస్ట్‌లు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ తీరును ఖండిస్తున్నారు. మరోవైపు జిల్లాల వారీగా ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో (Hyderabad) సమావేశం నిర్వహించారు.
Desk Journalists | వివక్ష సరికాదు
అక్రిడిటేషన్ కార్డుల జారీ విషయంలో డెస్క్ జర్నలిస్టులపై ప్రభుత్వం వివక్ష చూపడం సరికాదని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ అన్నారు. డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు కాకుండా మీడియా కార్డులు ఇవ్వాలని నిర్ణయించడం తగదన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డెస్క్ జర్నలిస్టులు బుధవారం హైదరాబాద్ త్యాగరాయ గానసభలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో అస్పష్టంగా, జర్నలిస్టుల ప్రయోజనాలకు భంగం కలిగించేదిలా ఉందన్నారు. ముఖ్యంగా ఫీల్డ్ జర్నలిస్టులు, డెస్క్ పాత్రికేయుల మధ్య విభజన రేఖ గీసేందుకు ఈ జీవో ద్వారా ప్రభుత్వం ప్రయత్నించిందని విమర్శించారు.