అక్షరటుడే, వెబ్‌డెస్క్: Desk journalists | ప్రభుత్వం రెండేళ్ల తర్వాత నూతన అక్రెడిటేషన్లను (new accreditations) జారీ చేసేందుకు చర్యలు చేపట్టింది. జీవో 252 పేరుతో మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులోని అంశాలు జర్నలిస్టులను విభజించేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇన్నాళ్లు వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఒకేరకమైన అక్రెడిటేషన్లు జారీ చేస్తూ వస్తున్నారు. అయితే కొత్తగా తీసుకువచ్చిన జీవో ప్రకారం ఇకపై రెండు రకాల కార్డులు ఇవ్వనున్నారు. ఫీల్డ్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డు, డెస్క్ జర్నలిస్టులకు (desk journalists) మీడియా కార్డు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అక్రెడిటేషన్ కార్డు ప్రభుత్వ సమాచారాన్ని సేకరించేందుకు రిపోర్టర్లకు గుర్తింపుగా ఉపయోగపడుతుందని, డెస్క్ జర్నలిస్టులు మీడియా కార్డును సంక్షేమ పథకాలకు మాత్రమే వాడుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న కార్డుల సంఖ్యలోనూ భారీగా కోత విధించారు. ఈ నిబంధనలు జర్నలిస్టులను ఆగ్రహానికి గురి చేస్తున్నాయి.
Desk journalists | ‘కోత’ల ప్రభుత్వం..
కొత్త జీవోతో ప్రింట్ మీడియా కార్డులకు (print media cards) భారీగా కోతపడనుంది. గతంలో ఎంప్యానల్మెంట్, ముద్రించే పేజీల ఆధారంగా కార్డులు ఇచ్చేవారు. ఇప్పుడు సర్క్యులేషన్‌ను ప్రామాణికంగా తీసుకున్నారు. 16 పేజీలు అంత కంటే ఎక్కువ పేజీలున్న పత్రికలకు రాష్ట్రస్థాయిలో రిపోర్టర్లకు 20, డెస్క్ 20, ఫొటోగ్రాఫర్లకు 4 చొప్పున కార్డులిచ్చేవారు. ఇప్పుడు రిపోర్టర్లకు 12, డెస్క్‌కు 12, ఫొటోగ్రాఫర్లకు 2 కార్డులే ఇవ్వనున్నట్లు జీవోలో పేర్కొన్నారు. ఎడిషన్ కేంద్రాలలో గతంలో రిపోర్టర్లకు 8, డెస్క్‌కు 8, ఫొటోగ్రాఫర్లకు మూడు కార్డులు ఇచ్చే వారు. వాటిలో సగం కోతపెట్టారు. డెస్క్ జర్నలిస్టులకు ఎడిషన్ లేని జిల్లాలలోనూ గతంలో ఐదు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వగా.. ఈసారి వాటి ఊసే లేదు. కేవలం ఎడిషన్ కేంద్రాలున్న చోట మాత్రమే నాలుగు చొప్పున కార్డులివ్వనున్నారు. అదీ మీడియా కార్డులు మాత్రమే.. ఒక డెస్క్‌లో పది మంది సబ్ఎడిటర్లు పనిచేస్తుంటే మిగిలిన ఆరుగురికి అన్యాయం జరిగినట్లే..
Desk journalists | టీయూడబ్ల్యూజే(ఐజేయూ)పై వ్యతిరేకత
ప్రభుత్వం జారీ చేసిన అక్రెడిటేషన్ల మార్గదర్శకాల జీవో టీయూడబ్ల్యూజే(ఐజేయూ) మెడకు చుట్టుకుంటోంది. ప్రస్తుత ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి ఆ యూనియన్‌కు గతంలో ప్రాతినిధ్యం వహించి ఉండడం, ఆ యూనియన్‌కు చెందిన పలువురు పెద్ద తలకాయలు డెస్క్ జర్నలిస్టుల విషయంలో పలుమార్లు వివక్ష చూపిన ఉదంతాలు ఉండడంతో సబ్ ఎడిటర్లు తమ కోపాన్ని టీయూడబ్ల్యూజే(ఐజేయూ)పై చూపిస్తున్నారు. ఆ సంఘం సభ్యత్వాలను వీడే ఆలోచనలోనూ ఉన్నట్లు తెలిసింది.
Desk journalists | పోరుబాట..
అక్రెడిటేషన్ల విషయంలో తమకు అన్యాయం జరిగిందని ఆందోళన చెందుతున్న డెస్క్ జర్నలిస్టులు పోరుబాట పట్టారు. జర్నలిస్టుల్లో విభజన తీసుకువచ్చేలా ఉన్న జీవో నంబర్ 252ను వెనక్కి తీసుకోవాలని, అర్హులందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో పలువురు డెస్క్ జర్నలిస్టులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. జిల్లా స్థాయిలలోనూ ఆందోళనలకు సబ్ఎడిటర్లు సన్నద్ధమవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని డెస్క్ జర్నలిస్టులు గురువారం సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. త్వరలో కలెక్టర్, పీసీసీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారులను కలిసి తమ సమస్యలను విన్నవించడానికి సన్నద్ధమవుతున్నారు.