అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు మారడం లేదు. కార్యాలయాలకు వచ్చే ప్రజల నుంచి లంచాలు తీసుకుంటున్నారు. డబ్బులు ఇస్తేనే పనులు చేపడుతున్నారు.
అంతేగాకుండా ఎవరైనా నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకోవాల్సింది పోయి డబ్బులు అడుగుతున్నారు. తమకు మాముళ్లు ముట్టచెబితే ఎలాంటి చర్యలు ఉండవని హామీ ఇస్తున్నారు. తాజాగా ఓ డిప్యూటీ తహశీల్దార్‌ను ఏసీబీ అధికారులు (ACB officials) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల తహశీల్దార్ కార్యాలయంలో (Illandu Mandal Tahsildar office) డిప్యూటీ తహసీల్దార్‌గా మహ్మద్ యాకూబ్ పాషా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఓ రేషన్ దుకాణాన్ని పనివేళల్లో మూసివేయడంతో పాటు స్టాక్ కొరత ఉన్నట్లు ఆయన గుర్తించారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపకుండా ఉండటానికి రూ.30 వేల లంచం డిమాండ్ చేశాడు.
దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సోమవారం ఇల్లందు మండల రేషన్ దుకాణ డీలర్ల (Ration Shop Dealers) అధ్యక్షుడు పోతు శబరీష్ ద్వారా లంచం తీసుకుంటుంగా.. ఏసీబీ అధికారులు డిప్యూటీ తహశీల్దార్ పాషాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయనతో పాటు గిరిజన సహకార సంఘం ఇల్లందు సాంకేతిక సహాయకుడు విజయ్ కుమార్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు.
ACB Raid | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు (ACB Officers) సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు.
ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
