అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Case | రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి వేళ్లూనుకు పోయింది. అన్ని శాఖల్లో అవినీతి అధికారులు మోపయ్యారు. లంచాలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. ఏసీబీ దాడులు (ACB Raids) చేపట్టి కేసులు నమోదు చేస్తున్నా.. లంచాలకు మరిగిన అధికారుల్లో ఇసుమంతైన మార్పు రావడం లేదు. సామన్య ప్రజల నుంచి మొదలు పెడితే కాంట్రాక్టర్ల వరకు ఎవరిని ఈ అధికారులు వదలడం లేదు. రూ.500 నుంచి మొదులు పెడితే రూ.లక్షల వరకు లంచాలు డిమాండ్ చేస్తున్నారు. పనిని బట్టి డబ్బులు అడుగుతున్నారు. తాజాగా ఓ డిప్యూటీ తహశీల్దార్ (Deputy Tahsildar)ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
నల్గొండ పౌరసరఫరాల శాఖ అధికారులు ఇటీవల ఓ కేసులో మూడు వాహనాలను సీజ్ చేశారు. అయితే ఆ వాహనాలకు పంచనామా చేసి నివేదికను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం కోర్టు జరిమానా వేసి ఆ వాహనాలను విడుదల చేస్తోంది. అయితే పంచానామా చేయడానికి నల్గొండ పౌర సరఫరాల శాఖ మిర్యాలగూడ (Miryalaguda) విభాగంలో డిప్యూటీ తహశీల్దార్‌గా పని చేస్తున్నషేక్ జావేద్ (DT Shake Javeed) రూ.లక్ష లంచం అడిగాడు. బాధితుడు బతిమిలాడటంతో ఆ మొత్తాన్ని రూ.70 వేలకు తగ్గించాడు. ఈ క్రమంలో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో డిప్యూటీ తహశీల్దార్ షేక్ జావీద్‌ను ఏసీబీ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు.
ACB Case | ఏసీబీ దూకుడు
ఇటీవల ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. వరుసగా దాడులు చేస్తూ అవినీతి అధికారుల గుండెళ్లో హడల్ పుట్టిస్తున్నారు. అయినా పలువురు అధికారులు మాత్రం లంచాలు తీసుకోవడం మానడం లేదు. ఇటీవల మంచిర్యాల (Mancherial) జిల్లా కోటపల్లి డిప్యూటీ తహశీల్దార్ (Kotapalli DT) ఆకిరెడ్డి నవీన్‌కుమార్, అటెండర్ అంజన్న ఏసీబీకి చిక్కారు. రూ.పది వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు వారిని పట్టుకున్నారు. ప్రజలకు కూడా అవగాహన పెరగడంతో లంచాలు అడిగిన వారిని ఏసీబీకి పట్టిస్తున్నారు. అయితే ప్రజల్లో మరింత అవగాహన పెరిగేలా అవినీతి నిరోధక శాఖ అధికారులు కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
ACB Case | రైతుల సంబరాలు
అవినీతి అధికారులు ప్రజలను పట్టి పీడిస్తున్నారు. ముఖ్యంగా తహశీల్దార్ కార్యాలయాలు (Tahsildar Offices) అవినీతి కేంద్రాలుగా మారాయి. వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వెళ్లే రైతుల (Farmers)ను అధికారులు లంచాల కోసం వేధిస్తున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. లేదంటే కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి తహశీల్దార్ (Talakondapalli Tahsildar) నాగర్జున, అటెండర్ యాదగిరి రూ.పది వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అయితే అవినీతి తహశీల్దార్‌తో విసిగిపోయిన రైతులు ఆయన ఏసీబీకి చిక్కగానే సంబరాలు చేసుకున్నారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట పటాకులు కాల్చి వేడుకలు చేసుకున్నారు. దీనిని బట్టి అవినీతి అధికారుల వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ACB Case | భయపడొద్దు.. ఫిర్యాదు చేయండి
ప్రజలు ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా తమకు ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని పేర్కొంటున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.