అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు మారడం లేదు. ఏసీబీ అధికారులు (ACB Officers) దాడులు చేస్తున్నా.. నిత్యం కేసులు నమోదు అవుతున్నా భయ పడకుండా లంచాలు అడుగుతున్నారు. కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలను లంచాల కోసం వేధిస్తున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. లేదంటే అది లేదు.. ఇది లేదు.. అని కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. తాజాగా లంచం తీసుకుంటూ ఓ డిప్యూటీ తహశీల్దార్ ఏసీబీకి చిక్కాడు.
మంచిర్యాల (Mancherial) జిల్లా కోటపల్లి మండల తహశీల్దార్ (Kotapalli Tahsildar) కార్యాలయంలో ఆకిరెడ్డి నవీన్‌కుమార్ డిప్యూటీ తహశీల్దార్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఓ వ్యక్తి తన తండ్రి ఆధార్‌కార్డును పట్టాపాస్‌బుక్కు లింక్ చేయడానికి డిప్యూటీ తహశీల్దార్ (Deputy Tahsildar)ను కలిశాడు. ఆధార్ లింక్ చేయడంతో పాటు పట్టాదార్ పాస్‌పుస్తకం జారీ చేయడానికి డిప్యూటీ తహశీల్దార్ నవీన్‌కుమార్ (DT Naveen Kumar) రూ.10 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా డిప్యూటీ తహశీల్దార్ నవీన్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయనతో పాటు కార్యాలయంలో అటెండర్‌గా పని చేస్తున్న గవిడి అంజన్నను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. అంజన్న తన తండ్రి జబ్బు పడడడంతో కార్యాలయంలో ఆయనకు బదులుగా పని చేస్తున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
ACB Trap | అవినీతి కేంద్రాలుగా..
రెవెన్యూ కార్యాలయాలు అవినీతి కేంద్రాలుగా మారాయి. ముఖ్యంగా తహశీల్దార్ ఆఫీసుల్లో అటెండర్, ఆపరేటర్ నుంచి మొదలు పెడితే తహశీల్దార్ వరకు లంచాలు తీసుకుంటున్నారు. పనికి ఇంత ప్రజల నుంచి నేరుగా అడుగుతున్నారు. లంచం తీసుకోవడం కూడా కొందరు ఒక డ్యూటీగా భావిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఏసీబీ దాడుల్లో ఎక్కువ శాతం తహశీల్దార్ కార్యాలయాల్లోని సిబ్బందే దొరుకుతున్నారు.
ఇటీవల రంగారెడ్డి (Rangareddy) జిల్లా తలకొండపల్లి తహశీల్దార్ నాగార్జున లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ తహశీల్ ఆఫీస్‌లో ఓ ఆపరేటర్ లంచం తీసుకుంటూ దొరికాడు. ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ACB Trap | లంచం ఇవ్వొద్దు
ప్రజలు ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా తమకు ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని పేర్కొంటున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.