అక్షరటుడే, గాంధారి: Panchayat Elections | తమ తండాకు సర్పంచ్ పదవిలో వివక్ష చూపారని నిరసిస్తూ ఉపసర్పచ్, వార్డుల సభ్యులు రాజీనామా చేశారు. గాంధారి మండలం (Gandhari mandal) పంతులు నాయక్ తండాలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తమ తండా సర్పంచ్ అభ్యర్థిని బెదిరించి నామినేషన్ విత్ డ్రా చేయించి ఆ పదవిని సోమ్లా నాయక్ తండాకు ఏకగ్రీవం చేసుకున్నారంటూ పంతులు నాయక్ తండావాసులు కలెక్టరేట్లో ధర్నా చేశారు. ఈ మేరకు ఎన్నికల నోడల్ అధికారికి (election nodal officer) వినతిపత్రం అందజేశారు.
Panchayat Elections | విచారణాధికారిగా తహశీల్దార్..
అయితే ఈ ఘటనపై గాంధారి తహశీల్దార్ రేణుక చవాన్ (Gandhari Tahsildar Renuka Chavan) శనివారం మధ్యాహ్నం తండాకు వెళ్లి విచారణ చేపట్టారు. ముందుగా సోమ్లా నాయక్ తండాకు వెళ్లిన తహశీల్దార్.. తండా వాసులతో మాట్లాడారు. తాము ఎవరినీ బెదిరించలేదని, అందరి సమ్మతితో పాలకవర్గం ఏకగ్రీవమైందని వారు పేర్కొన్నారు. అనంతరం పంతులు నాయక్ తండాలో విచారణ చేపట్టగా సోమ్లా నాయక్ తండాలో తమకంటే ఓటర్లు ఎక్కువగా ఉన్నారని పేర్కొంటూ ఆ తండా వారికే సర్పంచ్ పదవి దక్కాలని దౌర్జన్యం చేస్తున్నారని తండావాసులు పేర్కొన్నారు.
Panchayat Elections | బెదిరించి దించేశారు..
తమ తండా నుంచి సర్పంచ్ అభ్యర్థిగా బానోత్ లలిత గోప్య నామినేషన్ వేస్తే వారికి డబ్బులు పంపి ఒత్తిడి చేసి నామినేషన్ విత్ డ్రా చేయించారని ఆరోపించారు. అలాగే కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడిన సమయంలో చేసుకున్న ఒప్పందంలో భాగంగా సోమ్లా నాయక్ తండాలో ఒకరు ఇప్పటికే సర్పంచ్ (Sarpanch) అయ్యారని.. ఈసారి తమ వంతు అయినప్పటికీ దౌర్జన్యం చేశారని వారు ఆరోపించారు.
Panchayat Elections | మూకుమ్మడి రాజీనామాలు..
తమ తండాకు జరిగిన అన్యాయానికి నిరసనగా ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు బదావత్ టిక్యా, రమావత్ రమేష్, జాదవ్ రాణిలు పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తమ రాజీనామాను అధికారులు ఆమోదించాలని కోరారు. కాగా.. విచారణ జరిపిన తహశీల్దార్ రేణుక నివేదికను ఉన్నతాధికారులకు అందించనున్నారు.