అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు ఏ మాత్రం మారడం లేదు. సామాన్య ప్రజల నుంచి మొదలు పెడితే బడా వ్యాపారుల వరకు ఎవరిని వదలడం లేదు. అందరిని లంచాల(Bribe) పేరిట వేధిస్తున్నారు. ఎంతొస్తే అంత అన్నట్లు వారి స్థాయిని బట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేపడుతున్నారు. తాజాగా ఓ హోటల్ యజమాని నుంచి రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసిన అధికారిని ఏసీబీ (ACB) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని రాజేంద్ర నగర్ పురపాలక సంఘం డిప్యూటీ కమిషనర్‌గా కె రవికుమార్ పని చేస్తున్నారు. అయితే ఆయన ఇటీవల ఓ హోటల్లో తనిఖీలు చేపట్టారు. హోటల్లో అవకతవకాలు గుర్తించారు. అయితే సదరు హోటల్‌ను సీజ్ చేయకుండా ఉండటంతో పాటు భవిష్యత్‌లో వ్యాపారం సజావుగా జరుపుకోవడానికి యజమాని నుంచి రూ.5 లక్షల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారుల (ACB Officers)కు సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో శుక్రవారం డిప్యూటీ కమిషనర్ రవి కుమార్ రూ.రెండు లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ACB Trap | అవినీతి కేంద్రాలుగా..
రాష్ట్రంలోని పలు మున్సిపల్ కార్యాలయాలు (Municipal Offices) అవినీతి కేంద్రాలుగా మారాయి. పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజలను లంచాల కోసం కొందరు అధికారులు వేధిస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ హోటల్‌ను సీజ్ చేయకుండా ఉండటానికి డబ్బులు డిమాండ్ చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. హోటల్ వంట గదిలో అవకతకలు ఉంటే సీజ్ చేయాల్సింది పోయి బేరం మాట్లాడుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న హోటళ్లపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఇలా లంచాలు తీసుకుంటే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ACB Trap | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని తెలుపుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.