అక్షరటుడే, ఇందూరు: Midday Meal Scheme | మధ్యాహ్న భోజన కార్మికులపై జిల్లా విద్యాశాఖ అధికారి (District Education Officer) ఒత్తిడి పెంచడం మానుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెలకు నాలుగు సార్లు మటన్, చికెన్ పెట్టాలని డీఈవో చెబుతున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మధ్యాహ్న భోజన పథకం (mid-day meal scheme) అమలు చేస్తోందన్నారు. ప్రాథమిక పాఠశాలలో ఒక్కో విద్యార్థికి రూ.6.78, ఉన్నత పాఠశాల విద్యార్థులకు గుడ్డుతో కలిపి రూ.13.17 ఇస్తుందన్నారు. కానీ ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారం రూ.13లో రెండు కూరగాయలు, పప్పు, కోడిగుడ్లు పెట్టడం సాధ్యం కాదని.. సుమారు రూ.22 ఇస్తేనే సాధ్యమవుతుందన్నారు.
దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ కమిషనర్, జిల్లా ఉన్నతాధికారులకు వినతి పత్రం అందించామని తెలిపారు. కానీ జిల్లా విద్యాశాఖ అధికారి మాత్రం కూరగాయలు, పప్పుతో పాటు ఉడకపెట్టిన గుడ్డు, నెలకు నాలుగు సార్లు మటన్, చికెన్ పెట్టాలని చెప్పడం సరికాదన్నారు.
బహిరంగ మార్కెట్లో మాంసాహారం (non-vegetarian food) ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.13తో ఎలా వంట చేసి పెడతారని ప్రశ్నించారు. ఇప్పటికే కొంతమంది మధ్యాహ్న భోజన కార్మికులపై ఒత్తిడి పెంచుతున్నారన్నారు. సమావేశంలో మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి హన్మాండ్లు, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
