అక్షరటుడే, వెబ్డెస్క్ : Dense Fog | దేశ రాజధాని ఢిల్లీలో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచు కమ్మేసింది. దీంతో విజిబిలిటీ పడిపోయింది. ఉదయం 10 గంటల వరకు కూడా పొగమంచు వీడడం లేదు.
పొగ మంచు కారణంగా ఢిల్లీ ఎయిర్పోర్టులో (Delhi Airport) 148 విమానాలు రద్దు అయ్యాయి. అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని విమానాలను అధికారులు దారి మళ్లించారు. గాలినాణ్యత 400 పాయింట్లకు పడిపోవడంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో గాలి నాణ్యత ‘తీవ్రమైన’ కేటగిరీలోకి జారిపోయే అవకాశం ఉందని, జనవరి 2న చాలా పేలవంగా ఉండే అవకాశం ఉందని ఎయిర్ క్వాలిటీ అధికారులు హెచ్చరించారు.
Dense Fog | ప్రయాణికుల ఇబ్బందులు
డిసెంబర్ 31 ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Indira Gandhi International Airport) 148 విమానాలు రద్దు అయ్యాయి. అందులో ఢిల్లీకి వచ్చే విమానాలు 70, ఢిల్లీ నుంచి వెళ్లాల్సినవి 78 ఉన్నాయి. అదనంగా రెండు విమానాలను దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పొగమంచుతో విజిబిలిటీ తగ్గడంతో హైవేలపై వాహనదారులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచు పరిస్థితులు ఇలాగే కొనసాగితే విమాన రాకపోకలపై ప్రభావం పడుతుందని ఇండిగో ఎయిర్లైన్స్ (IndiGo Airlines) తెలిపింది. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, అంతరాయాన్ని తగ్గించడానికి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంది.