అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Delhi Name Change | దేశ రాజధాని ఢిల్లీ పేరు మార్చాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి. దాని పేరును ‘ఇంద్రప్రస్థ’గా మార్చాలని ఇటీవల వీహెచ్‌పీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా చాందినీ చౌక్‌కు చెందిన బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్‌వాలా ఇదే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit Shah)కు లేఖ రాశారు.
బీజేపీ అధికారంలోకి వచ్చాక పలు ప్రాంతాలు, రోడ్ల పేర్లను మార్చిన విషయం తెలిసిందే. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా వలస పాలనకు చిహ్నంగా ఉన్న పేర్లను తొలగించారు. ఈ క్రమంలో దేశ రాజధాని పేరు మార్చాలనే డిమాండ్ తెరపైకి రావడం గమనార్హం. మహా భారత కాలంలోని ఇంద్రప్రస్థ పేరును ఢిల్లీకి పెట్టాలని ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల (BJP MP Praveen Khandelwala)కోరారు. చారిత్రాక, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడానికి పేరు మార్చాలని ఆయన పేర్కొన్నారు.
Delhi Name Change | పాండవులు స్థాపించిన రాజధాని
ఇంద్రప్రస్థ పాండవులు స్థాపించిన రాజధానిగా పిలుస్తారని ఆయన పేర్కొన్నారు. నగరం పేరుతో పాటు రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్టు పేర్లను మార్చాలని ఆయన లేఖలో ప్రస్తావించారు. పాత ఢిల్లీ రైల్వే స్టేషన్ పేరును ఇంద్రప్రస్థ జంక్షన్‌గా, విమానాశ్రయానికి ‘ఇంద్రప్రస్థ విమానాశ్రయం'(Indraprastha Airport) అని పేరు పెట్టాలన్నారు. మహాభారత కాలం నాటి వారసత్వాన్ని కాపాడుకోవడానికి నగరంలోని ప్రధాన ప్రదేశాలలో పాండవుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని సూచించారు. మహాభారతం ప్రకారం ఇంద్రప్రస్థం క్రీ.పూ. 3000 ప్రాంతంలో పాండవుల రాజధాని అని ఎంపీ లేఖలో పేర్కొన్నారు.
Delhi Name Change | గతంలో సైతం..
చారిత్రక నగరాలైన ప్రయాగ్‌రాజ్, అయోధ్య, ఉజ్జయిని, వారణాసి వంటివి వాటి మూలాలకు అనుగుణంగా ఉన్నాయని ప్రవీణ్ ఖండేల్‌వాలా అన్నారు. ఢిల్లీ (Delhi) సైతం అలా ఎందుకు ఉండకూడదని ఆయన ప్రశ్నించారు. ఈ మార్పు భవిష్యత్ తరాలకు చరిత్ర, సంస్కృతి, పాండవుల నీతి, ధర్మాన్ని తెలియజేయడానికి ఉపయోగపడుతుందన్నారు. కాగా గతంలో వీహెచ్‌పీ సైతం ఇదే తరహా డిమాండ్ చేసింది. గత నెలలో ఢిల్లీ సాంస్కృతిక శాఖ మంత్రి కపిల్ మిశ్రాకు వీహెచ్‌పీ కార్యదర్శి సురేంద్రకుమార్ గుప్తా నగరం పేరును ఇంద్రప్రస్థగా మార్చాలని లేఖ రాశారు. అయితే ప్రతిపక్ష పార్టీలు పేరు మార్పును వ్యతిరేకిస్తున్నాయి.
