అక్షరటుడే, వెబ్డెస్క్ : Delhi | దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత మరోసారి తీవ్రమైన స్థాయికి పడిపోయింది. కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ‘ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్’ (Air Quality Management Commission) కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) – దశ 3 అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) సమాచారం ప్రకారం.. సోమవారం ఢిల్లీలో వాయు నాణ్యత సూచి (AQI) 362గా ఉండగా.. మంగళవారం ఉదయం 7 గంటలకు అది 425కు చేరింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక కాలుష్య స్థాయిగా ఇది గుర్తించబడింది.
Delhi | గాలిలో విషం..
గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరడంతో, ఢిల్లీ ప్రభుత్వం (Delhi Government) విద్యార్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (Directorate of Education) ద్వారా జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. ఢిల్లీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రైవేట్ పాఠశాలల్లో ఐదో తరగతి వరకు విద్యార్థులకు ఆన్‌లైన్ బోధన (Online Teaching) విధానం అమలు చేయాలని నిర్ణయించింది. కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం ఇప్పటికే అనేక ఆంక్షలు విధించింది. వాటిని ఉల్లంఘించిన పక్షంలో రూ. 20 వేల వరకు జరిమానా విధించబడుతుందని CAQM స్పష్టం చేసింది.
అదనంగా, 2020 ఏప్రిల్‌కు ముందు అమ్ముడైన అన్ని BS-IV కేటగిరీ వాహనాలు మరియు 2010 ఏప్రిల్‌కు ముందు ఉన్న BS-III వాహనాల వినియోగాన్ని తాత్కాలికంగా నిషేధించారు. ప్రస్తుతం దేశంలో BS-VI వాహనాలు వినియోగంలో ఉన్నాయి. వీటితో పోలిస్తే, BS-IV మరియు BS-III వాహనాలు అధిక స్థాయిలో కాలుష్యకారకాలను విడుదల చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వాయు కాలుష్యాన్ని(Air Pollution) తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగం పెంచాలని, వాహన వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కానీ పొగమంచు, వాహన ఉద్గారాలు, పంట అవశేషాల దహనం వంటి అంశాలు కలసి నగర గాలిని మరింత విషపూరితంగా మారుస్తున్నాయి.
