అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Delhi | ఇటీవల ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ప్రతి ఒక్కరిని భయబ్రాంతులకి గురి చేసింది. ఈ బ్లాస్ట్‌లో చాలా మంది మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన మరిచిపోకముందే ఇప్పుడు ఢిల్లీ (Delhi)లో మరో విషాదం చోటుచేసుకుంది.
దక్షిణ ఢిల్లీలోని సంగం విహార్ ప్రాంతంలో శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం (Major Fire Accident) సంభవించి నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులను కలవరపరిచిన ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.
Delhi | ప్రమాదం ఎలా జరిగింది?
సంగం విహార్ (Sangam Vihar)లోని ఓ నాలుగంతస్తుల నివాస భవనంలో ఉన్న చెప్పుల షాపులో శనివారం సాయంత్రం 6:24 గంటల సమయంలో అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి. మంటలు అంత వేగంగా వ్యాపించడంతో భవనంలో ఉన్నవారు బయటకు రాకముందే పరిస్థితి విషమించింది. స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపక దళాలకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించినా, అప్పటికే ప్రాణ నష్టం సంభవించింది.
Delhi | మృతుల్లో అన్నాచెల్లెళ్లు
ఈ ప్రమాదంలో దుర్మరణం పొందిన వారిలో భవన యజమాని సతీందర్ గుప్తా (38), ఆయన సోదరి అనిత (40) ఉన్నారు. ఇద్దరూ సజీవ దహనమై అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తిని గాయాలపాలై ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. అతడి వివరాలు తెలియాల్సి ఉంది. మరణించిన మరో వ్యక్తి కూడా ఎవరో పోలీసులు గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనలో మమత (40) అనే మహిళ మంటల్లో చిక్కుకుని తీవ్రంగా కాలిపోయి బయటపడింది. మరో మహిళ ప్రాణాలు రక్షించుకునే క్రమంలో భవనం టెర్రస్‌పై నుంచి కిందకు దూకింది. ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో అన్న, చెల్లెలు సహా మొత్తం నలుగురు మృతి చెందినట్టు తెలుస్తుంది.
ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. షార్ట్ సర్క్యూట్ (Short Circuit) కారణమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.పోలీసులు కేసు నమోదు చేసి, అగ్నిప్రమాద కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.ఈ ఘటనతో సంగం విహార్ ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది. ముందస్తు జాగ్రత్త చర్యలు లేకపోవడం, భవనంలో సమయానికి అలారంలేని కారణంగా ప్రాణ నష్టం జరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించగా, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.