HomeUncategorizedDelhi CM Attacked | ఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి.. చెంప‌దెబ్బ కొట్టిన దుండగుడు

Delhi CM Attacked | ఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి.. చెంప‌దెబ్బ కొట్టిన దుండగుడు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delhi CM Attacked | ఢిల్లీ ముఖ్య‌మంత్రి రేఖాగుప్తాపై (Rekha Gupta) దాడి జ‌రిగింది. బుధ‌వారం సివిల్ లైన్స్‌లోని త‌న అధికార నివాసంలో జ‌న్ సున్‌వాయి (Jan Sunwai) కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌జ‌ల నుంచి విజ్ఞ‌ప్తులు స్వీక‌రిస్తుండ‌గా, ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. విజ్ఞాప‌న ప‌త్రం అందించే వ్య‌క్తిలా వ‌చ్చిన 30 ఏళ్ల దుండ‌గుడు పేప‌ర్లు అందిస్తున్న‌ట్లు న‌టించి రేఖాగుప్తాను చెంపదెబ్బ కొట్టాడు. అక్క‌డే ఉన్న భ‌ద్ర‌తా సిబ్బంది సీఎంను హుటాహుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఢిల్లీ పోలీసు (Delhi Police) ఉన్నతాధికారులు సీఎం నివాసానికి చేరుకుని ద‌ర్యాప్తు ప్రారంభించారు. దుండగుడ్ని ప‌ట్టుకున్న పోలీసులు అత‌డిని స్టేష‌న్‌కు త‌ర‌లించి విచారిస్తున్నారు.

Delhi CM Attacked | ఫిర్యాదు చేసేందుకు వ‌చ్చి..

ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి ప్రతి వారం తన అధికారిక నివాసంలో ‘జ‌న్ సున్‌వాయి’ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తారు. ఈ సంద‌ర్భంగా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌జ‌ల నుంచి వినతులు స్వీక‌రిస్తారు. బుధవారం ఉద‌యం కూడా ఆమె ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతుండ‌గా, ఓ దుండగుడు దాడి చేశారు. “సమావేశంలో ఉన్న ఒక వ్యక్తి ముఖ్యమంత్రిపై దాడి చేశాడు. ప్రస్తుతం వైద్యులు ముఖ్యమంత్రిని పరీక్షిస్తున్నారు. మేము దాడిని ఖండిస్తున్నాము. ఈ దాడి రాజకీయంగా ప్రేరేపించబడిందా అని దర్యాప్తు చేయాలని” బీజేపీ (BJP) సీనియ‌ర్ నేత ఖురానా తెలిపారు.

Delhi CM Attacked | రాజ‌కీయ కుట్ర‌..

దుండ‌గుడు ముఖ్యమంత్రిని చెంపదెబ్బ కొట్టి, ఆమె జుట్టును లాగాని ఖురానా చెప్పారు. దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందని అనుమానిస్తున్నట్లు బీజేపీ తెలిపింది. ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో చేస్తున్న పనులను ప్రత్యర్థులు సహించలేకపోతున్నారని, దాడి చేసిన వ్యక్తి వెనుక ఎవరున్నారో తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా వెల్ల‌డించారు.

Delhi CM Attacked | ఖండించిన ఆప్‌..

సీఎంపై దాడిని ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకురాలు అతిషి అన్నారు. “ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై జరిగిన దాడి తీవ్రంగా ఖండించదగినది. ప్రజాస్వామ్యంలో, భిన్నాభిప్రాయాలు, నిరసనలకు చోటు ఉంటుంది, కానీ హింసకు చోటు లేదు. నిందితులపై ఢిల్లీ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. ముఖ్యమంత్రి పూర్తిగా సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నాను” అని ప్రతిపక్ష నాయకురాలు అతిషి పేర్కొన్నారు.