HomeజాతీయంDelhi Blast | కారు బాంబు అనుమానితుడి ఫొటో విడుద‌ల‌.. డాక్టర్ ఉమర్‌గా అనుమానం!

Delhi Blast | కారు బాంబు అనుమానితుడి ఫొటో విడుద‌ల‌.. డాక్టర్ ఉమర్‌గా అనుమానం!

ఢిల్లీ కారు బాంబు ఘ‌ట‌న దేశాన్ని ఉలిక్కిప‌డేలా చేసింది. ఈ ఘటనతో ఢిల్లీలో భద్రతా వ్యవస్థ అలర్ట్ మోడ్‌లోకి వెళ్లింది. అన్ని ప్రధాన చారిత్రక, ప్రభుత్వ కేంద్రీకృత ప్రాంతాల్లో పోలీసు పహారా బలపరిచారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delhi Blast | ఢిల్లీలోని ఎర్రకోట (Red Fort) వద్ద జరిగిన కారు బాంబు పేలుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ భయానక ఘటనలో ఇప్పటివరకు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. భద్రతా దళాలు ఘటనా స్థలాన్ని పూర్తిగా ముట్టడి చేసి, సాక్ష్యాలను సేకరిస్తున్నాయి.

పేలుడు తీవ్రత దృష్ట్యా ఇది ఆత్మాహుతి దాడి అయి ఉండొచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి డాక్టర్ ఉమర్ మహమ్మద్ అనే వ్యక్తి పేరు ప్రధాన అనుమానితుడిగా బయటకొచ్చింది. అతను తెలుపు రంగు హ్యుందాయ్ ఐ20 కారులో (Hyundai i20 Car) ఉన్నట్లు సమాచారం. ఆ కారును పేలుడు చోటుకు తానే తీసుకెళ్లి, డెటోనేటర్ ద్వారా పేల్చినట్టు విచారణ అధికారులు అనుమానిస్తున్నారు.

Delhi Blast | పోలీసులు గుర్తించిన వివరాలు

తాజాగా విడుదలైన ఫొటోలో ఉన్న వ్యక్తి ఉమర్ మహమ్మద్‌నే అని అనుమానిస్తున్నారు. జమ్మూకశ్మీర్, హర్యానా ప్రాంతాల్లో ఇటీవల బయటపడిన వైట్ కాలర్ టెరర్ మాడ్యూల్‌కు అతనికి లింకులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఆ మాడ్యూల్‌లో భాగమైన డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, డాక్టర్ ముజమ్మిల్ షకీల్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరిని పట్టుకున్న విషయం తెలుసుకున్న ఉమర్, ఫరీదాబాద్ (Faridabad) నుంచి పరారయ్యాడు. అతడు ఆందోళనలోపడి తానే వాహనాన్ని పేల్చుకున్నాడనే అనుమానం వ్యక్తమవుతోంది.

పోలీసులు పరిశీలనలో HR 26 CE 7674 నంబర్ ఉన్న ఐ20 కారు మూడు గంటలపాటు ఎర్రకోట వద్ద పార్క్ చేయబడినట్లు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం మధ్యాహ్నం 3.19 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు ఆ వాహనం అక్కడే నిలిచింది. వాహనం యజమాన్య వివరాలు బయటకు రావడంతో పెద్ద కుట్ర‌ బయటపడింది. 2025 మార్చిలో సల్మాన్ అనే వ్యక్తి ఆ కారును దేవేందర్‌కు విక్రయించాడు. అనంతరం అక్టోబర్ 29న దేవేందర్ నుంచి ఆమిర్ కారు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఆమిర్ చేతుల నుంచి డాక్టర్ ఉమర్ మహమ్మద్ వాహనాన్ని తీసుకున్నట్లు పోలీసులు (Delhi Police) గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు ఆమిర్ మరియు తారిక్ అనే వ్యక్తులను విచారిస్తున్నారు. పేలుడు వెనుక ఉన్న టెరర్ నెట్‌వర్క్‌ వివరాలు వెలుగులోకి తెచ్చేందుకు దర్యాప్తు విస్తృతంగా కొనసాగుతోంది.

Must Read
Related News