అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Delhi Bomb Threat | ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. ఖలిస్తాని పేరుతో పాఠశాలు, ఎర్రకోట, సచివాలయానికి బెదిరింపులు వచ్చాయి.
దేశ రాజధానిలోని ఎర్రకోట (Red Fort), ఢిల్లీ సచివాలయానికి సోమవారం బాంబు బెదిరింపు ఫోన్లు వచ్చాయి. దీంతో భద్రతా సంస్థలు అప్రమత్తం అయ్యాయి. ఢిల్లీ సచివాలయానికి ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో అగ్నిమాపక శాఖ (Fire Department) సిబ్బంది, పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు.
Delhi Bomb Threat | రెండు పాఠశాలలకు..
ఢిల్లీలోని రెండు పాఠశాలలకు సోమవారం ఉదయం బాంబు బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చాయి. ధౌలా కువాన్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, లోధి రోడ్‌లోని ఎయిర్ ఫోర్స్ బాల్ భారతి స్కూల్ (Air Force Bal Bharati School)లో బాంబు పెట్టినట్లు దుండగులు మెయిల్ చేశారు. దీంతో పోలీసులు పాఠశాలల నుంచి విద్యార్థులను బయటకు పంపించారు. అనంతరం బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. అయితే వారికి ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించ లేదు. దీంతో ఇవి నకిలీ బెదిరింపులుగా తేల్చారు.
ఖలిస్తాన్ (Khalistan) పేరుతో దుండగులు బెదిరింపులకు పాల్పడటం గమనార్హం. పంజాబీలో రాసిన ఈమెయిల్లో ఖలిస్తాన్ గురించి పేర్కొన్నారు. ఢిల్లీ విధాన సభ, ఎర్రకోట, ఢిల్లీ మెట్రో స్టేషన్లను పేల్చేస్తామని హెచ్చరించారు. కాగా ఇటీవల ఢిల్లీలో బాంబు బెదిరింపులు పెరగడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో బాంబు పెట్టినట్లు దుండగులు ఫోన్లు చేయడం, మెయిల్స్ పంపడం చేస్తున్నారు. ఇందులో అన్ని నకిలీవే ఉంటున్నాయి. అయినా కూడా ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు.
