HomeజాతీయంDelhi Blast | ఢిల్లీ పేలుడు ఉగ్ర‌దాడే.. పుల్వామా వ‌యా ఫ‌రీదాబాద్ టు ఢిల్లీ

Delhi Blast | ఢిల్లీ పేలుడు ఉగ్ర‌దాడే.. పుల్వామా వ‌యా ఫ‌రీదాబాద్ టు ఢిల్లీ

ఢిల్లీ కారుబాంబు పేలుడు ఘ‌ట‌న వెనుక ఉగ్ర కోణం బ‌య‌ట ప‌డింది. అమ్మోనియం నైట్రేట్‌, డిటోనేట‌ర్లు ఉప‌యోగించి పేలుడుకు పాల్ప‌డిన‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delhi Blast | ఢిల్లీలోని చారిత్ర‌క ఎర్ర‌కోట స‌మీపంలో సోమ‌వారం చోటు చేసుకున్న కారుబాంబు పేలుడు ఘ‌ట‌న వెనుక ఉగ్ర కోణం బ‌య‌ట ప‌డింది. సోమ‌వారం భ‌ద్ర‌తాబ‌ల‌గాలు ఛేదించిన ఫ‌రీదాబాద్ టెర్రర్ మాడ్యుల్‌కు చెందిన భారీ ఉగ్ర కుట్ర నేప‌థ్యంలోనే తాజా పేలుడు చోటు చేసుకున్న‌ట్లు తేలింది.

అమ్మోనియం నైట్రేట్‌ (Ammonium Nitrate), డిటోనేట‌ర్లు (Detonators) ఉప‌యోగించి పేలుడుకు పాల్ప‌డిన‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది. పుల్వామా ప్రాంతానికి చెందిన డాక్ట‌ర్ ఉమ‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ఆత్మాహుతి దాడికి పాల్ప‌డిన‌ట్లు బ‌య‌ట ప‌డింది. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ ను భ‌ద్ర‌తాబ‌ల‌గాలు ప‌సిగ‌ట్టిన నేప‌థ్యంలో తాను దొరికిపోతాన‌నే భ‌యంతోనే డాక్టర్ ఉమర్ మొహమ్మద్ ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్లు తేలింది. ఎర్ర‌కోట స‌మీపంలోని జంక్ష‌న్ వ‌ద్ద పేలుడు చోటు చేసుకున్న‌ కారును అత‌డే న‌డుపుతున్న‌ట్లు గుర్తించారు. అత‌డికి సంబంధించిన ఫొటోను ద‌ర్యాప్తు సంస్థ‌లు విడుద‌ల చేశాయి. ఎర్రకోట సమీపంలో పేలిన కారును నడుపుతున్న వ్యక్తి తొలి చిత్రం ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లో బయటపడిందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఫరీదాబాద్‌లోని టెర్రర్ మాడ్యూల్‌తో అతనికి సంబంధాలు ఉన్నాయని, అక్కడ భారీ పేలుడు పదార్థాల నిల్వను స్వాధీనం చేసుకున్న‌ట్లు పేర్కొన్నాయి.

Delhi Blast | టెర్ర‌ర్ మాడ్యుల్‌కు, పేలుడుకు సంబంధం..

ఢిల్లీలో తొమ్మిది మందిని బలిగొన్న ఎర్రకోట (Red Fort) సమీపంలో జరిగిన పేలుడులో అమ్మోనియం నైట్రేట్, ఇంధన నూనె డిటోనేటర్లను వినియోగించిన‌ట్లు ప్రాథమిక ద‌ర్యాప్తులో తేలింది. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ కు సంబంధించి 360 కిలోల అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం చేసుకున్న ఘటనకు, ఢిల్లీ పేలుడుకు మధ్య సంబంధం ఉన్నట్లు గుర్తించిన‌ట్లు ద‌ర్యాప్తు సంస్థ‌లు తెలిపాయి. మ‌రోవైపు, తాజా పేలలుడుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు (Delhi Police) ఉపా చ‌ట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫరీదాబాద్ లో బయటపడిన టెర్రర్ మాడ్యూల్ కు సంబంధం ఉందని ప్రాథమిక పరిశోధనలు సూచించడంతో దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో విస్తృత త‌నిఖీలు నిర్వ‌హించారు. పేలుడుకు కార‌ణ‌మైన కారును న‌డుపుతున్న వ్య‌క్తి చిత్రాన్ని పోలీసులు విడుద‌ల చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లో న‌మోదైన ప్ర‌కారం స‌ద‌రు వ్య‌క్తి ముసుగు ధరించి కారు నడిపించాడ‌ని పోలీసులు తెలిపారు.

Delhi Blast | డాక్ట‌ర్ ఉమ‌రే సూత్ర‌ధారి

ఢిల్లీ పేలుళ్లకు (Delhi Blast), పుల్వామాకు సంబంధం ఉన్న‌ట్లు ద‌ర్యాప్తు సంస్థ‌లు గుర్తించాయి. పేలుడు కేసులో ఆత్మాహుతి బాంబర్‌గా అనుమానిస్తున్న డా.ఉమర్ మహమ్మద్ పుల్వామా నివాసి అని తేలింది. ఎర్రకోట సమీపంలో పేలిన వైట్ క‌ల‌ర్ హ్యుండాయ్ ఐ20 కారును అత‌డే న‌డుపుతున్న‌ట్లు పోలీసులు తేల్చారు. 1989లో పుల్వామాలో జ‌న్మించిన ఉమ‌ర్‌.. ఫ‌రీదాబాద్ (Faridabad) అల్ ఫ‌లాహా మెడిక‌ల్ కాలేజీలో డాక్ట‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. జమ్ము కశ్మీర్, హరియాణా పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌ ‘వైట్ కాలర్’ టెర్రర్ మాడ్యూల్‌లో సోమవారం అరెస్టైన ఇద్దరు వైద్యులు అదిల్ అహ్మద్ రాథర్, ముజామ్మిల్ షకీల్‌లతో ఇతడికి సాన్నిహిత్యం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ త‌ర్వాత కొన్ని గంట‌ల‌కే ఢిల్లీలో పేలుడు చోటు చేసుకుంది. టెర్ర‌ర్ మాడ్యూల్ బ‌య‌ట ప‌డ‌డంతో త‌న‌ను అరెస్టు చేస్తారన్న భ‌యంతోనే ఉమ‌ర్ ఈ దారుణానికి ఒడిగ‌ట్టున‌ట్లు ద‌ర్యాప్తు సంస్థ‌లు అనుమానిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో జమ్ము కశ్మీర్ లో ఉంటున్న‌ అత‌డి తల్లి, సోదరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Delhi Blast | ముమ్మ‌రంగా ద‌ర్యాప్తు..

ఎర్రకోట పేలుడు కేసును ద‌ర్యాప్తు సంస్థ‌లు ముమ్మ‌రంగా ద‌ర్యాప్తు చేస్తున్నాయి. 500 మందికి పైగా అత్యంత నైపుణ్యం కలిగిన అధికారులు, సిబ్బందితో కూడిన భారీ బృందాన్ని ఇక్క‌డ‌ మోహరించారు. ఈ బృందంలో ఇంటెలిజెన్స్ బ్యూరో (Intelligence Bureau), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (National Investigation Agency), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG), ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్. స్థానిక పోలీసు విభాగాల సభ్యులు ఉన్నారు. కింది స్థాయి నుంచి ఉన్న‌తాధికారులతో ఈ బృందం విస్తృతంగా శోధిస్తోంది. ప్ర‌త్యేక బృందం ఎర్ర‌కోట స‌మీపంలోని వెయ్యికి సీసీటీవీల ఫుటేజ్‌ను ప‌రిశీలిస్తోంది. మ‌రోవైపు ఢిల్లీ, ఫ‌రీదాబాద్‌, కాశ్మీర్ త‌దిత‌ర ప్రాంతాల్లో ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది.

Delhi Blast | స‌మీక్షించిన అమిత్ షా

ఢిల్లీ పేలుడు నేప‌థ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) మంగ‌ళ‌వారం ఉన్న‌త స్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు. ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో 12 మంది మరణించిన నేప‌థ్యంలో దేశంలో భ‌ద్ర‌తా ప‌రిస్థితిని స‌మీక్షించారు. హోం మంత్రి నివాసంలో జ‌రిగిన ఈ సమావేశంలో కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ దేకా, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా, NIA డీజీ సదానంద్ వసంత్ డేట్ పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ డిజిపి నళిన్ ప్రభాత్ కూడా వర్చువల్‌గా సమావేశానికి హాజరయ్యారు. పేలుడు తర్వాత పరిస్థితిపై ఉన్నతాధికారులు హోం మంత్రికి బ్రీఫింగ్ చేశారు.

Must Read
Related News