అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Delhi Blast | ఢిల్లీ (Delhi) పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఎర్రకోట సమీపంలో కారులో పేలుడు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రద్దీగా ఉండే ప్రాంతంలో బ్లాస్ట్ జరగడంతో ఇప్పటికే 8 మంది మృతి చెందారు.
ఢిల్లీ ఎర్రకోట (Red Fort) సమీపంలో మెట్రోస్టేషన్ గేట్ – 1 దగ్గర పార్క్ చేసిన కారులో పేలుడు చోటు చేసుకుంది. పేలుడు ధాటికి పక్కన ఉన్న పలు కార్లు సైతం ధ్వంసం అయ్యాయి. రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో ప్రాణనష్టం అధికంగా జరిగింది. ఇప్పటి వరకు 8 మంది చనిపోగా.. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Delhi Blast | అధికారులతో మాట్లాడిన అమిత్ షా
ఎర్రకోట మెట్రో స్టేషన్ పార్కింగ్ కారులో హైగ్రేడ్ ఎక్స్‌ప్లోజివ్ ఉపయోగించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఈ ఘటనపై ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. గాయపడ్డ వారికి LNJP ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అమిత్ షా సూచించారు. ఈఘటనపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. సాయంత్రం 6.52 గంటలకు బ్లాస్ట్ జరిగిందన్నారు. నెమ్మదిగా వచ్చిన వాహనం రెడ్‌లైట్ దగ్గర ఆగిందన్నారు. ఆ సమయంలో వాహనంలో పేలుడు చోటు చేసుకుందని వెల్లడించారు.
Delhi Blast | భద్రత కట్టుదిట్టం
ఢిల్లీలో పేలుడుతో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ముంబై (Mumbai), హైదరాబాద్ (Hyderabad) సహా అన్ని ప్రధాన నగరాల్లో అధికారులు అప్రమత్తం అయ్యారు. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలో ఘటనాస్థలికి NIA, NSG బృందాలు చేరుకున్నాయి. పేలుడు ధాటికి పలువురి శరీరాలు నలిగిపోయాయి. పేలుడు తీవ్రత అధికంగా ఉండటంతో సమీపంలోని భవనాలు, కిటికీ ఫ్రేములు తలుపులు కదిలాయని స్థానికులు తెలిపారు.