అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Delhi Blast Case | ఢిల్లీ ఎర్రకోట (Red Fort) వద్ద జరిగిన బాంబు పేలుడు ఘటన దేశం యావత్తును దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. కాగా.. తాజాగా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పేలుడు చోటుచేసుకున్న కారును నడిపిన ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ నబీ ఇంటిని భద్రతా దళాలు పేల్చివేశాయి. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) పుల్వామాలోని అతడి ఇంటి వద్ద కూల్చివేత ప్రక్రియను చేపట్టినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
Delhi Blast Case | ఎర్రకోట పేలుడుతో 13 మంది మృతి
ఢిల్లీ (Delhi) లోని ఎర్రకోట వద్ద సోమవారం జరిగిన పేలుడులో 13 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. హ్యుందాయ్ ఐ20 కారులో ఈ పేలుడు జరిగిందని అధికారులు గుర్తించారు. పలు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఈ కార్డును డాక్టర్ ఉమర్ నబీ (Dr. Umar Nabi) నడిపినట్లు తెలుసుకున్నారు. కారులో దొరికిన ఆనవాళ్లను అతడి కుటుంబసభ్యుల డీఎన్‌ఏతో పరీక్షించగా.. కారు నడిపింది ఉమరే అని తేలింది. కాగా.. ఈ పేలుడులో డాక్టర్ ఉమర్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు గుర్తించారు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఉగ్ర మాడ్యూల్‌ను అధికారులు ఛేదిస్తున్న క్రమంలో పేలుడు ఘటన జరిగిన విషయం తెలిసిందే. అయితే నిందితుడు ఉమర్‌కు ఈ మాడ్యూల్‌తో సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఉగ్ర నెట్‌వర్క్ (Terrorist Network) వెనుక ఎవరున్నారనే దానిపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.
