అక్షరటుడే, వెబ్డెస్క్: Delhi-Agra Expressway Accident | ఉత్తరప్రదేశ్లోని మథుర జిల్లాలో ఢిల్లీ–ఆగ్రా ఎక్స్ప్రెస్వే Delhi-Agra Expressway పై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దట్టమైన పొగమంచు (Thick Fog) కారణంగా వరుసగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఆరు బస్సులు సహా పలు కార్లు మంటల్లో కాలిపోయాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం.
తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో మథుర జిల్లాలోని యమునా ఎక్స్ప్రెస్వే ఆగ్రా–నోయిడా క్యారేజ్వేపై ఈ ప్రమాదం జరిగింది. తీవ్రమైన పొగమంచు కారణంగా ముందున్న వాహనాలు డ్రైవర్లకు కనిపించకపోవడంతో నాలుగు బస్సులు, రెండు కార్లు వరుసగా ఢీకొన్నాయని పోలీసులు తెలిపారు. స్పందించడానికి డ్రైవర్లకు తగిన సమయం లేకపోవడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది.
Delhi-Agra Expressway Accident | పొంగమంచు కారణంగా ప్రమాదం
ఢీకొన్న వెంటనే కొన్ని వాహనాల్లో మంటలు చెలరేగాయి. ఒక వాహనం నుంచి మరో వాహనానికి మంటలు వేగంగా వ్యాపించడంతో పరిస్థితి అదుపు తప్పింది. బస్సులు, కార్లలో చిక్కుకున్న ప్రయాణికులు బయటపడేందుకు ప్రయత్నిస్తూ సహాయం కోసం కేకలు వేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
సంఘటన స్థలంలో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు, పోలీసులు, అంబులెన్స్ Ambulance బృందాలు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తీసుకురావడంతో పాటు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
మృతుల సంఖ్యపై అధికారులు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే మంటల తీవ్రత, ప్రమాదంలో చిక్కుకున్న వాహనాల సంఖ్యను బట్టి ప్రాణనష్టం ఎక్కువగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. చాలా వాహనాలు పూర్తిగా కాలిపోవడంతో మృతుల గుర్తింపు ప్రక్రియకు సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు.
ఈ శీతాకాలంలో Winter దట్టమైన పొగమంచు కారణంగా జరిగిన అత్యంత దారుణమైన ప్రమాదాల్లో ఇది ఒకటిగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘోర ప్రమాదంలో పలువురు సజీవదహనమయ్యారు. ఇప్పటి వరకు నలుగురి మృతదేహాలను గుర్తించగా, మరికొందరు ప్రయాణికులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.