అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Delhi Acid Case | దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం రేపిన యాసిడ్ దాడి కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ఓ యువతిపై యాసిడ్ దాడి జరిగిందన్న ఆరోపణలు పూర్తిగా తప్పుడు అని ఢిల్లీ పోలీసులు (Delhi Police) తేల్చారు.
పెయింటర్ సహా ముగ్గురు నిర్దోషులపై తప్పుడు కేసు నమోదు చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. అసలు యాసిడ్ దాడి జరగలేదని, పాత కక్షల కారణంగా యువతి, ఆమె కుటుంబసభ్యులు ఈ నాటకం ఆడారని పోలీసులు వెల్లడించారు.ఉత్తర ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతం (Ashok Vihar Area)లో అక్టోబర్ 26న తనపై యాసిడ్ దాడి జరిగిందని యువతి ఫిర్యాదు చేసింది. పెయింటర్ జితేందర్, అతని సహాయకులు ఇషాన్, అర్మాన్‌లను నిందితులుగా పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించగా.. ఘటన సమయంలో నిందితులు ఆ ప్రాంతంలో లేరని తేలింది.
Delhi Acid Case | మిస్టరీ వీడింది..
స్పెషల్ పోలీస్ కమిషనర్ (Special Police Commissioner) రవీంద్ర సింగ్ యాదవ్ మాట్లాడుతూ, “యువతి తండ్రి, నిందితుల మధ్య ప్లాట్ విషయంలో పాత తగాదాలు ఉన్నాయి. ఆ కక్షతోనే యువతి, ఆమె తండ్రి, సోదరుడు, అంకుల్ కలిసి ఈ నాటకం రచించారు” అని వివరించారు.ఇక దర్యాప్తులో మరో సంచలన విషయం కూడా వెలుగుచూసింది. యాసిడ్ దాడి (Acid Attack)కి కొద్ది రోజుల ముందు జితేందర్ భార్య, యువతి తండ్రి అకిల్ ఖాన్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టినట్లు తెలిసింది. దానికి ప్రతీకారంగా ఈ కుట్ర పన్నారు అని పోలీసులు నిర్ధారించారు.
యువతి విచారణలో, టాయిలెట్ క్లీనర్ (Toilet Cleaner)ను చేతులపై పోసుకుని గాయాలు చేసుకుని ఆసుపత్రిలో చేరినట్లు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. “ముగ్గురు అమాయకులపై తప్పుడు కేసు పెట్టిన ఈ కుట్రను భగ్నం చేయడం సంతోషంగా ఉంది. ఇప్పుడు యువతి, ఆమె కుటుంబసభ్యులపై చట్టపరమైన చర్యల కోసం న్యాయ సలహా తీసుకుంటున్నాం” అని రవీంద్ర సింగ్ యాదవ్ తెలిపారు. అసలు విషయం తెలిసి అందరు ఉలిక్కి పడుతున్నారు. ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

