అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Aadhaar Numbers | దేశంలోని రెండు కోట్లకు పైగా ఆధార్ నంబర్లను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) తొలగించింది. మరణించిన వారి ఆధార్ నంబర్ల (Aadhaar numbers) తొలగించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నంబర్లను మరొకరికి కేటాయించమని యూఐడీఏఐ స్పష్టం చేసింది.
దేశంలో మరణించిన వారి వివరాలను యూఐడీఏఐ సేకరించింది. ఆ వివరాల ఆధారంగా రెండు కోట్లకు పైగా ఆధార్ నంబర్లను తాజాగా డీయాక్టివేట్ చేసింది. ఆధార్ సమాచారం (Aadhaar information) తాజాగా, కచ్చితంగా ఉండేలా ఈ చర్య చేపట్టినట్లు పేర్కొంది. ఆధార్ నంబర్లను మరొక వ్యక్తికి ఎప్పుడూ తిరిగి కేటాయించనప్పటికీ, గుర్తింపు మోసం (identity fraud), సంక్షేమ ప్రయోజనాల కోసం ఆధార్‌ను అనధికారికంగా ఉపయోగించకుండా నిరోధించడానికి మరణం తర్వాత డీయాక్టివేషన్ అవసరమని తెలిపింది.
ఈ సంవత్సరం ప్రారంభంలో UIDAI సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (Civil Registration System) ద్వారా 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నమోదైన మరణాల కోసం myAadhaar పోర్టల్‌లో కుటుంబ సభ్యుని మరణ నివేదిక సేవను ప్రారంభించింది. మిగిలిన ప్రాంతాలలో సైతం దీనిని అమలు చేయనుంది. కుటుంబ సభ్యులు మరణించిన వ్యక్తి ఆధార్ నంబర్, మరణ నమోదు నంబర్, జనాభా వివరాలను సమర్పించవచ్చు. UIDAI డీయాక్టివేషన్‌ను ప్రారంభించే ముందు సమాచారాన్ని ధృవీకరిస్తుంది. కుటుంబ సభ్యులు తమ వివరాలను నమోదు చేసుకుని, ఆ తర్వాత మరణించిన వ్యక్తి ఆధార్ నంబర్, డెత్ సర్టిఫికెట్తో పాటు ఇతర వ్యక్తిగత వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ సమచారాన్ని సరి చూసిన తర్వాత చనిపోయిన వ్యక్తి ఆధార్ నంబర్‌ను యూఐఏడీఐ డీయాక్టివేట్ చేస్తుంది.