అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | పెళ్లి కాకుండా గర్భవతి అయిన అమ్మాయికి అబార్షన్ చేసిన ఘటన ఇటు వైద్యాధికారులు (Medical officers), అటు పోలీసు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. ‘అక్షరటుడే’ (Aksharatoday) ఈ ఘటనను వెలుగులోకి తీసుకురాగా జిల్లా యంత్రాంగంలో చలనం వచ్చింది.
Kamareddy | త్వరగా ముగించే ప్రయత్నం..
విచారణ సాధ్యమైనంత త్వరలో ముగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆస్పత్రిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుకంజ వేస్తున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది. ఈ ఘటనపై లోతుగా సమాచారం తెలుసుకునే ప్రయత్నంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కామారెడ్డిలో పలు ఆస్పత్రులను మెయింటేన్ చేసే వ్యక్తి అబార్షన్ చేసిన ఆస్పత్రిలో కూడా భాగస్వామిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయనతో పాటు ఓ మాజీ కౌన్సిలర్ (Former Councilor) కూడా ఆస్పత్రిలో పార్ట్నర్గా ఉన్నారని సమాచారం. ఇద్దరు వ్యక్తులు కూడా రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉన్నట్టుగా తెలిసింది. ఈ క్రమంలో ఆస్పత్రి పేరు బయటకు రాగానే సదరు భాగస్వాములు అప్రమత్తమైనట్టుగా సమాచారం. ఇటు పోలీసులు, అటు వైద్యశాఖ నుంచి ఆస్పత్రిపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.
Kamareddy | రంగంలోకి బడానేత..?
చిన్న విషయం అయితే సదరు భాగస్వాములే సెటిల్ చేసే వారని, అబార్షన్ ఘటనపై సీరియస్‌గా విచారణ జరుగుతుండడంతో ఓ బడానేతను రంగంలోకి దింపే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఎస్పీ కూడా సీరియస్‌గా ఉండడంతో బాధిత కుటుంబానికి నచ్చజెప్పి కేసు నీరుగార్చే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. కామారెడ్డి పట్టణ నడిబొడ్డున ఉన్న ఈ ఆస్పత్రి, స్కానింగ్ సెంటర్లను కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఇటు పోలీసులు, అటు వైద్యాధికారులు ఆస్పత్రిపై చర్యలు తీసుకుంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Kamareddy | పీఎంపీ సలహాతోనే..
ఈ అబార్షన్ ఘటనలో ఓ పీఎంపీ వైద్యుడి (PMP Doctor) హస్తం ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. సదరు పీఎంపీ సూచనతోనే స్కానింగ్ సెంటర్‌కు వెళ్లి పరీక్ష చేసుకున్నారని, ఆ తర్వాత ఆస్పత్రి గైనిక్ వైద్యురాలిని సంప్రదించినట్టుగా సమాచారం. ఇప్పటికే రెండుసార్లు సదరు పీఎంపీ వైద్యుడిని పోలీస్‌స్టేషన్‌కు కూడా పిలిపించి విచారణ జరిపినట్లుగా తెలుస్తోంది. పోలీసుల విచారణ అనంతరం ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని (Yellareddy Constituency) పలువురు నేతలు పీఎంపీపై చర్యలు తీసుకోకుండా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం.
Kamareddy | పోక్సో నిందితుడి రిమాండ్..?
ఇదిలా ఉండగా ఈ ఘటనకు కర్త, కర్మ క్రియ అయిన వ్యక్తిపై పోలీసులు ఇప్పటికే పొక్సో కేసు నమోదు చేశారు. గత ఆరు రోజులుగా అతన్ని పోలీస్ కస్టడీలో ఉంచుకుని విచారణ జరిపినట్లుగా తెలుస్తోంది. బుధవారం అతడిని రిమాండ్‌కు తరలించే యోచనలో పోలీసులు ఉన్నట్టుగా సమాచారం.