అక్షరటుడే, కామారెడ్డి : Panchayat elections | ‘‘నన్ను గెలిపిస్తామంటే బీర్లు పంచిన.. చీరలు (beer and sarees) ఇచ్చిన.. తమ్సప్, స్ప్రైట్ బాటిళ్లు ఇచ్చాను. అన్ని తీసుకుని తాగి నన్ను ఓడించారు’ అంటూ రాయలేని భాషలో బూతు పురాణం అందుకుంది ఓడిన వార్డు మెంబర్ అభ్యర్థి. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఓటర్లు బీర్లు, చీరలు, తమ్సప్, స్ప్రైట్ బాటిళ్లతో గ్రామ పంచాయతీ (village panchayat office) ముందు నిరసన తెలిపారు.
ఈ ఘటన రామారెడ్డి మండలం (Ramareddy mandal) ఉప్పలవాయి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాబవ్వ రెండో వార్డు నుంచి పోటీ చేశారు. ఎన్నికలలో గెలవడానికి అందరి మాదిరిగా ఆమె కూడా ఓటర్లను ఆకట్టుకునేందుకు బీర్లు, మహిళలకు చీరలు, థమ్సప్, స్ప్రైట్ బాటిళ్లు పంపిణీ చేసింది. తీరా ఎన్నికల్లో ప్రత్యర్థి అభ్యర్థి గెలుపొందారు. దాంతో ఫ్రస్టేషన్‌కు గురైన బాబవ్వ వారం రోజుల నుంచి వార్డు ఓటర్లను ఇష్టానుసారంగా పరుష పదజాలంతో దూషిస్తోంది.
ఆ మాటలను భరించలేని వార్డు ఓటర్లు బాబవ్వ ఇంటికి వెళ్లి నిలదీసినా ఆమె నుంచి స్పందన కరువైంది. గురువారం కూడా ఆమె తన నోటికి పని చెప్పడంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె పంపిణీ చేసిన చీరలు, బీర్లు, థమ్సప్, స్ప్రైట్ బాటిళ్లను తీసుకుని వచ్చి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు పడేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వార్డు ఓటర్లు మాట్లాడుతూ.. ఎన్నికల్లో తమకు ఆమె చెప్పిన చీరలు, బీర్లను పంచాలని అడగలేదని, అప్పుడు ఇచ్చి ఇప్పుడు ఓటమి చెంది ఇష్టమున్నట్టు మాట్లాడటం సరికాదన్నారు. ఇంటికి వెళ్లి అడిగితే సమాధానం ఇవ్వడం లేదని, అందుకే పంచాయతీ కార్యాలయం ముందు నిరసన తెలిపినట్లు చెప్పారు. విషయం కాస్తా పోలీసులకు చేరడంతో రామారెడ్డి ఎస్సై రాజశేఖర్ గ్రామానికి చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలను సముదాయించే ప్రయత్నం చేయగా పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉన్న వాటర్ ట్యాంక్ సమీపంలో బాటిల్స్ పెట్టేసి వెళ్లిపోయారు.