అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Deepika Padukone | బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొణే ఇటీవల తల్లిగా మారిన తర్వాత తన జీవనశైలిలో స్పష్టమైన మార్పులు చేసుకుంటోంది. సినిమాల కంటే కుటుంబానికి, ముఖ్యంగా తన కూతురికి సమయం కేటాయించాలన్నదే ఆమె ప్రస్తుత ప్రాధాన్యం.
ఈ క్రమంలోనే ప్రభాస్ సరసన నటించాల్సిన ‘స్పిరిట్’ సినిమా (Spirit Movie) విషయంలో దీపిక తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మాతృత్వ బాధ్యతల నేపథ్యంలో రోజుకు 8 గంటలకే పని చేయగలనని దీపిక స్పష్టం చేయగా, చిత్రబృందం దీనికి అంగీకరించలేదనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా ఆమె ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ అంశాన్ని దీపిక స్వయంగా జాతీయ స్థాయిలో ప్రస్తావించడంతో ఇండస్ట్రీలో పని గంటలు, హీరో–హీరోయిన్ సమానత్వంపై కొత్త చర్చ మొదలైంది.
Deepika Padukone | గతంలోనూ వివాదాలు..
హీరోలతో సమానంగా పని పరిస్థితులు ఉండాలని దీపిక చేసిన వ్యాఖ్యలు కొందరి ప్రశంసలు పొందగా, మరికొందరు మాత్రం భారీ రెమ్యునరేషన్ (Huge Remuneration) తీసుకుంటూ ఇలాంటి డిమాండ్స్ ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. హీరోయిన్లు కూడా వర్కింగ్ అవర్స్ నిర్ణయిస్తే షూటింగ్స్ ప్లాన్ చేయడం కష్టమవుతుందన్న అభిప్రాయం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇది దీపిక కెరీర్‌లో మొదటిసారి ఎదురైన వివాదం కాదు.‘పద్మావత్’ సినిమాలో రాణి పద్మావతిగా ఆమె నటనకు ప్రశంసలు దక్కినప్పటికీ, కొన్ని సీన్స్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రూమర్స్ కారణంగా ఆ సమయంలో భారీ నిరసనలు చోటు చేసుకున్నాయి. ‘పఠాన్’సినిమా (Pathaan Movie)లోని ‘బేషరమ్ రంగ్’ పాటలో బికినీ రంగు విషయంలో దేశవ్యాప్తంగా వివాదం చెలరేగింది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు తర్వాత మాదకద్రవ్యాల విచారణలో ఆమె పేరు వినిపించగా, NCB విచారణ జరిగినప్పటికీ ఎలాంటి నిర్ధారణ జరగలేదు. ‘ఛపాక్’ ప్రమోషన్స్ సమయంలో JNU విద్యార్థుల నిరసనలో పాల్గొనడం కూడా రాజకీయ, సామాజిక చర్చకు దారితీసింది. ఈ అన్ని పరిణామాల మధ్య దీపిక తన నిర్ణయాల విషయంలో ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. కెరీర్, వ్యక్తిగత జీవితం రెండింటికీ సమతూకం ఉండాలన్నదే ఆమె అభిప్రాయం. ప్రస్తుతం తల్లిగా తన కొత్త పాత్రను ఆస్వాదిస్తూ, ఎంపిక చేసిన ప్రాజెక్ట్స్‌కే కమిట్ అవాలని దీపిక భావిస్తున్నట్టు తెలుస్తోంది.