అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jubilee Hills By Elections | తెలంగాణలో జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో వేడి రాజేస్తోంది. అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్), ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ లాంటి ప్రధాన పార్టీలు ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
ఇప్పటికే బీఆర్‌ఎస్ అభ్యర్థి(BRS Candidate)ని ప్రకటించి ప్రచారం కూడా జోరుగా చేస్తున్నారు. ఇక రీసెంట్‌గా కాంగ్రెస్ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. ఇక బీజేపీ అభ్యర్థి ఎవరు? అన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఈ ఉపఎన్నికను ఎలాగైన గెలవాలని బీఆర్‌ఎస్ ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి ప్రచార యంత్రాంగాన్ని వేగవంతం చేసింది. ప్రత్యేకంగా వార్‌రూమ్ ఏర్పాటు చేసి, ప్రచారాన్ని సెంట్రలైజ్ చేయడం ద్వారా ప్రతిదశను పర్యవేక్షిస్తోంది. లోకల్ క్యాడర్‌తోపాటు టాప్ లీడర్లు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు.
Jubilee Hills By Elections | అభ్యర్థి ఎంపికపై ప్రత్యేక కమిటీ
బుధవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ(Congress Party) తమ అభ్యర్థిని ఖరారు చేసింది. గతంలో పోటీ చేసి ఓడిన నవీన్ యాదవ్‌ను మళ్లీ బరిలోకి దించేందుకు నిర్ణయం తీసుకుంది. స్థానికంగా పట్టు ఉండటంతో, బీసీ కార్డును అస్త్రంగా మార్చే వ్యూహంతో కాంగ్రెస్ ముందుకెళ్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సహా పార్టీలోని కీలక నేతలు నవీన్ వెంటే ఉన్నారు. ఇక భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది. తాజా సమాచారం ప్రకారం, రేపు (శుక్రవారం) అభ్యర్థిని ఖరారు చేయనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇది రాష్ట్ర అధ్యక్షుడు గోషామహల్ మాజీ ఎమ్మెల్యే రాంచంద్రర్ రావు నేతృత్వంలో జరుగుతున్న తొలి ఉపఎన్నిక కావడంతో, పార్టీ వ్యూహాలు ఎలా ఉంటాయన్నది కీలకంగా మారింది.
బీజేపీ ఇప్పటికే అభ్యర్థి ఎంపిక కోసం ప్రత్యేక కమిటీ వేసింది. ఈ కమిటీలో ధర్మారావు, పోతుగంటి రాములు, ఆంజనేయలు వంటి నేతలు ఉంటారు . వీరు నామినేషన్లను పరిశీలించి, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించారు. ఇందులో నామినేట్ చేసినవారిలో ముగ్గురు పేర్లు షార్ట్‌లిస్ట్ చేసి, రాష్ట్ర కమిటీ దాన్ని ఢిల్లీకి పంపనుంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, అభ్యర్థి రేసులో లంకల దీపక్ రెడ్డి, వీరపనేని పద్మ, కీర్తిరెడ్డి టాప్‌లో ఉన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఓడిన దీపక్ రెడ్డి మరోసారి ఛాన్స్ దక్కించుకునే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఈసారి మహిళా అభ్యర్థిని దింపాలన్న ఆలోచన బీజేపీలో ఉన్నట్లయితే, కీర్తి రెడ్డి పేరు పరిశీలించవచ్చు అన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది. మొత్తానికి ఈ ఉపఎన్నికతో తెలంగాణలో మరోసారి రాజకీయ ఉత్సాహం తారాస్థాయికి చేరింది.