HomeతెలంగాణPolitical Rakhi | అన్నాచెల్లి మ‌ధ్య ముదిరిన విభేదాలు.. కేటీఆర్‌కు రాఖీ క‌ట్ట‌ని క‌విత

Political Rakhi | అన్నాచెల్లి మ‌ధ్య ముదిరిన విభేదాలు.. కేటీఆర్‌కు రాఖీ క‌ట్ట‌ని క‌విత

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Political Rakhi | అన్నాచెల్లి మ‌ధ్య రాజకీయం చిచ్చు రేపింది. కేటీఆర్‌ (KTR), క‌విత (MLC Kavitha) మ‌ధ్య క‌నీసం ముఖం కూడా చేసుకోలేనంత ఎడ‌బాటు పెరిగింది. చివ‌ర‌కు రాఖీ పండుగ‌కు రాఖీ కట్ట‌లేనంత అగాధం ఏర్ప‌డింది. కేసీఆర్ కుటుంబంలో (KCR Family) చెల‌రేగిన ఆధిప‌త్య పోరుకు తెర ప‌డ‌లేదు. అన్న, చెల్లి న‌డుమ పంచాయితీ రాఖీ వేడుక‌తో ముగుస్తుంద‌ని భావించిన గులాబీ శ్రేణుల‌కు నిరాశే మిగిలింది. ప్ర‌తి రాఖీ పండుగ‌కు (Rakhi Festival) అన్న‌కు రాఖీ క‌ట్టే క‌విత ఈసారి క‌ట్ట‌క‌పోవ‌డంతో కేటీఆర్‌, క‌విత మ‌ధ్య చెప్ప‌లేనంత దూరం పెరిగి పోయిందని తేలిపోయింది. ఇద్ద‌రి మ‌ధ్య‌ కొన్నాళ్లుగా ఆధిప‌త్య పోరు నెల‌కొంద‌న్న ప్ర‌చారానికి తాజా ఉదంతం బ‌లం చేకూర్చుతోంది.

Political Rakhi | వ‌స్తాన‌న్న క‌విత‌.. లేన‌న్న కేటీఆర్‌

ఎప్ప‌టినుంచి వ‌స్తున్న ఆన‌వాయితీకి ఈసారి రాజకీయ వైరం బ్రేక్ వేసింది. క‌విత కేటీఆర్‌కు రాఖీ క‌ట్ట‌లేక పోయింది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో (social media) ఆస‌క్తిక‌ర చర్చ నడుస్తోంది. అయితే, రాఖీ క‌ట్టేందుకు క‌విత వ‌స్తాన‌ని, కానీ కేటీఆర్ నుంచి స్పంద‌న రాలేద‌ని ఆమె అనుచరులు చెబుతున్నారు. పండుగకు ఒకరోజు ముందే.. అన్నా.. రాఖీ కట్టేందుకు ఇంటికి రానా అని కవిత కేటీఆర్‌కు మెసేజ్‌ చేశారని తెలిపారు.

అయితే, కేటీఆర్‌ మాత్రం సూటిగా స్పందించ‌లేద‌ని తెలిసింది. పార్టీ కార్యాల‌యంలో జ‌రిగిన రాఖీపండుగ కార్య‌క్ర‌మంలో (Rakhi festival program) కేటీఆర్ పాల్గొన్నారు. అక్కడి నుంచి నేరుగా బెంగ‌ళూరుకు (Bangalore) వెళ్లిపోయిన‌ట్లు తెలిసింది. సాయంత్రం త‌ర్వాత కేటీఆర్ క‌విత‌కు మెసేజ్ చేసిన‌ట్లు స‌మాచారం. తాను అందుబాటులో లేనని స‌మాచారం ఇచ్చిన‌ట్లు బీఆర్ఎస్ వ‌ర్గాలు తెలిపాయి. ‘నేను అవుటాఫ్‌ స్టేషన్‌’ అంటూ ఆయన కవితకు తిరిగి మేసేజ్‌ పెట్టినట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి.

Political Rakhi | ఆధిప‌త్య పోరు..

ప్రతి రాఖీ పండుగకు సోదరుడు కేటీఆర్‌కు రాఖీ కట్టి, ఆశీర్వాదం తీసుకొనే కవిత అందుకు దూరంగా ఉన్నారు. అన్నాచెల్లి మ‌ధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నా, క‌విత ప్ర‌తి సంవ‌త్స‌రం త‌ప్ప‌కుండా రాఖీ క‌ట్టేవారు. కానీ, ఇటీవ‌ల రాజ‌కీయ విభేదాలు ముదిరిన నేప‌థ్యంలో ఆమె రాఖీ వేడుక‌కు దూరంగా ఉండిపోయారు. అందుకు కేసీఆర్ కుటుంబంలో (KCR Family) చెల‌రేగిన ఆధిప‌త్య పోరే కార‌ణం. తన తండ్రికి ర‌హ‌స్యంగా రాసిన లేఖ బ‌య‌టకు రావ‌డం, త‌ద‌నంత‌ర ప‌రిణామాల్లో క‌విత చేసిన వ్యాఖ్య‌లు అన్నాచెల్లి మ‌ధ్య నెల‌కొన్న విభేదాల‌ను బ‌య‌ట‌పెట్టాయి.

కేసీఆర్ దేవుడ‌ని, ఆయ‌న చుట్టూ దెయ్యాలున్నాయ‌ని వ్యాఖ్యానించి పార్టీ శ్రేణుల‌తో పాటు రాష్ట్ర రాజ‌కీయాల్లో క‌ల్లోలం సృష్టించారు. కేసీఆర్ ఒక్క‌డే త‌న‌కు నాయ‌కుడ‌ని, పార్టీలో మిగ‌తా వారెవ‌రు నాయ‌క‌త్వం వ‌హించే స్థాయికి ఎద‌గ‌లేద‌ని వ్యాఖ్యానించారు. అదే స‌మ‌యంలో త‌న‌పై కుట్ర‌లు జరిగాయని, నిజామాబాద్‌లో (Nizamabad) పార్టీ నేత‌లే త‌న‌ను ఓడించార‌ని వెల్ల‌డించారు. బీఆర్ఎస్ లో త‌గిన ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని, ప‌ర్య‌ట‌న‌లు చేయ‌కుండా నియంత్రిస్తున్నార‌ని తెలిపారు. బీఆర్ఎస్‌లోని ఓ పెద్ద నాయ‌కుడు త‌న‌పై దుష్ప్ర‌చారం చేస్తున్నాడ‌ని వెల్ల‌డించారు. నా మీద నీచంగా ఇంత మాట్లాడతారా? ఇదేనా రాజకీయం? అని మండిప‌డ్డారు.