అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు మారడం లేదు. కార్యాలయాలకు పనుల నిమిత్తం వచ్చే వారిని లంచాల పేరిట పట్టి పీడిస్తున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు.
రాష్ట్రంలో ఇటీవల ఏసీబీ దాడులు (ACB Raids) పెరిగాయి. అయినా లంచాలకు మరిగిన అధికారులు మాత్రం మారడం లేదు. వివిధ పనుల నిమిత్తం తమ దగ్గరకు వచ్చే ప్రజల నుంచి మొదలు పెడితే కాంట్రాక్టర్ల వరకు ఎవరిని వదలడం లేదు. ప్రతి పనికి ఓ రేటు పెట్టి మరీ పలువురు వసూళ్లు చేస్తున్నారు. తాజాగా ఓ డీఈఈ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.
ACB Trap | బిల్లులు చెల్లించడానికి..
ఓ వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) ప్రాంగణంలో పలు పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఆయా పనులకు సంబంధించి రూ.7,37,034 విలువైన బిల్లులను విడుదల చేయడానికి యూనివర్సిటీలో బిల్డింగ్ డివిజన్ డీఈఈగా పని చేస్తున్న రాకొండ శ్రీనివాసులు లంచం డిమాండ్ చేశాడు. బిల్లులు చెల్లించడంతో పాటు భవిష్యత్తు కాంట్రాక్టు పనులలో ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా ఉండటానికి రూ.11 వేలు ఇవ్వాలని అడిగాడు. ఇందులో రూ.5 వేలు గతంలోనే తీసుకున్నాడు. అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మంగళవారం రూ.6 వేలు లంచం తీసుకుంటుండగా డీఈఈ శ్రీనివాసులును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ACB Trap | లంచం ఇవ్వొద్దు
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు (ACB Officers) సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఏసీబీ వెబ్సైట్ (ACB Website) ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు.
ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.