అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపు సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని ఆయన పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ గెలుపుతో కాంగ్రెస్‌లో జోష్ వచ్చింది. ఇదే ఊపులో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 17 జరిగే మంత్రి వర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections)పై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. కాంగ్రెస్ (Congress) పార్టీ పదేళ్ల పాటు పాలిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
CM Revanth Reddy | అసూయ తగ్గించుకోండి
మాజీ మంత్రులు కేటీఆర్ (KTR), హరీశ్‌రావు (Harish Rao)పై సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు చేశారు. ఇప్పటికైనా హరీష్ రావు అసూయ, కేటీఆర్ అహంకారం తగ్గించుకుంటే మంచిదని హితవు పలికారు. అసూయ, అహంకారం పక్కన బెట్టి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ప్రతిపక్షంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కేసీఆర్ ఇప్పుడు రాజకీయాల్లో చురుగ్గా లేరని ఆయన పేర్కొన్నారు. క్రియాశీల రాజకీయ జీవితంలో లేని వ్యక్తి గురించి మాట్లాడాలనుకోవడం లేదని చెప్పారు.
CM Revanth Reddy | అభివృద్ధే లక్ష్యం
పార్టీల వ్యవహార శైలిని పరిశీలించిన ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారని ముఖ్యమంత్రి అన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం పెరిగింది అనడానికి ఈ ఫలితాలే నిదర్శనం అని చెప్పారు. జూబ్లీహిల్స్ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ (Hyderabad) నగరాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా తాము పని చేస్తున్నట్లు సీఎం తెలిపారు. పెండింగ్‌లో ఉన్న కేంద్ర నిధులను పొందేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహాయం చేయడం లేదని సీఎం విమర్శించారు. ఈ ఫలితాల తర్వాత అయినా ఆయన పునరాలోచించుకోవాలని హితవు పలికారు. తెలంగాణ అభివృద్ధిలో కేంద్రమంత్రులు కలిసి రావాలని కోరారు.
