అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sarpanch election | రాష్ట్రంలో రెండో దశ పంచాయతీ ఎన్నికలు (panchayat elections) ప్రశాంతంగా ముగిశాయి. ఆయా గ్రామాల్లో అధికారులు కౌంటింగ్ చేపట్టి విజేతల వివరాలు ప్రకటించారు. సంగారెడ్డి జిల్లాలో మరణించిన అభ్యర్థి సర్పంచ్‌గా గెలుపొందినట్లు అధికారులు తెలిపారు.
సంగారెడ్డి జిల్లా (Sangareddy district) రాయికోడ్ మండలం పిపడ్‌పల్లి పంచాయతీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం వెలువడింది. మరణించిన అభ్యర్థికి గ్రామస్తులు పట్టం కట్టారు. గ్రామంలో కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన రాజు ఈ నెల 8న ఆత్మహత్య చేసుకున్నాడు. అయ్యప్ప మాల ధరించిన రాజు సోమవారం చెట్టు ఉరి వేసుకున్నాడు. ఎన్నికల్లో ఖర్చుకు డబ్బులు లేవనే కారణంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే రాజు చనిపోయినా.. గ్రామస్తులు ఆయనకే ఓటు వేసి అభిమానాన్ని చాటుకున్నారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో రాజు గెలిచినట్లు అధికారులు తెలిపారు. అయితే చనిపోయిన అభ్యర్థి గెలవడంతో అక్కడ మళ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
Sarpanch election | తొలి దశలో సైతం
తొలి విడుత ఎన్నికల్లో సైతం మరణించిన అభ్యర్థి గెలుపొందిన ఘటన సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణా ఆర్అండ్ఆర్ కాలనీలో చెర్ల మురళి బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్‌గా పోటీ చేశారు. అయితే ఈ నెల 4న రాత్రి గుండెపోటుతో ఆయన చనిపోయారు. అధికారులు మురళి పేరు తొలగించకుండానే ఎన్నికలు నిర్వహించారు. 11న జరిగిన ఎన్నికల్లో ఆయన 378 ఓట్ల మెజారిటీతో సర్పంచ్‌గా గెలుపొందారు.