అక్షరటుడే, వెబ్డెస్క్ : Shashi Tharoor | కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ (Thiruvananthapuram MP Shashi Tharoor) మరోసారి సొంత పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. దశాబ్దాలుగా ఒకే కుటుంబం దేశ రాజకీయాలపై ఆధిపత్యం చెలాయించిందని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
వారసత్వ రాజకీయాలు జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీల్లోనూ భాగమైపోయాయన్నారు. వారసత్వ రాజకీయాలు, వారసత్వ నాయకత్వం జన్మతః హక్కు అనే ఆలోచనను స్థిరపరిచాయన్నారు. ఇవి దేశానికి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రాజెక్ట్ సిండికేట్ కోసం “భారత రాజకీయాలు ఒక కుటుంబ వ్యాపారం” (Indian Politics is a Family Business) అనే శీర్షికన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ రాసిన వ్యాసం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఆయన తన వ్యాసంలో రాజవంశ రాజకీయాల సంస్కృతిపై సంబంధిత ప్రశ్నలను లేవనెత్తారు. ఈ ధోరణి భారత ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పును కలిగిస్తుందని వ్యాఖ్యానించారు.
Shashi Tharoor | పెనవేసుకుపోయిన వారసత్వ రాజకీయాలు..
భారత రాజకీయాలు కుటుంబ వ్యాపారంగా మారాయని, ఇక్కడ నాయకత్వాన్ని జన్మ హక్కుగా పరిగణిస్తారని థరూర్ అన్నారు. వంశపారంపర్యతపై ఆధారపడిన రాజకీయ అధికారం (political power) పాలన, జవాబుదారీతనాన్ని దెబ్బతీస్తుందని నొక్కి చెప్పారు. ఎందుకంటే ఈ విధంగా ఎంపిక చేయబడిన నాయకులు తరచుగా ప్రజలు ఎదుర్కొంటున్న నిజమైన సవాళ్లను గుర్తించి పరిష్కరించరని, అసలు ప్రజలతోనే సంబంధాలు కలిగి ఉండరన్నారు.
వారసత్వ రాజకీయాలు భారతదేశంలో అంతర్భాగమయ్యాని శశిథరూర్ పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ వరకూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. పదవులను కుటుంబ వారసత్వంగా భావించినప్పుడు పాలన గాడి తప్పుతుందన్నారు. “రాజకీయ నేతల (political leaders) వారసులు నాయకత్వం వహించడానికి ప్రత్యేకంగా సరిపోతారనే నమ్మకం గ్రామ సభల నుంచి పార్లమెంటు అత్యున్నత స్థాయి వరకు భారత రాజకీయాల్లో లోతుగా అల్లుకుంది. కానీ ఎన్నికైన పదవిని కుటుంబ వారసత్వంగా పరిగణించినప్పుడు పాలన నాణ్యత తప్పనిసరిగా దెబ్బతింటుంది” అని థరూర్ పేర్కొన్నారు.
Shashi Tharoor | జన్మతః హక్కుగా ..
కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) తీరును తప్పుబడుతున్న థరూర్ మరోసారి కాంగ్రెస్ పై నేరుగానే దాడి చేశారు. “దశాబ్దాలుగా ఒకే కుటుంబం భారత రాజకీయాలపై ఆధిపత్యం చెలాయించింది. స్వతంత్ర భారతదేశ తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ, ప్రధానమంత్రులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాలతో సహా నెహ్రూ-గాంధీ వంశం ప్రభావం భారతదేశ స్వాతంత్ర్య పోరాట చరిత్రతో ముడిపడి ఉంది.
అదే సమయంలో రాజకీయ నాయకత్వం జన్మతః హక్కు అనే ఆలోచనను కూడా ఇది స్థిరపరిచిందని’ తెలిపారు. ఈ ఆలోచన ప్రతి పార్టీలోనూ, ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి స్థాయిలోనూ భారత రాజకీయాల్లోకి చొచ్చుకుపోయిందన్నారు. మమతా బెనర్జీ, మాయావతి వంటి ప్రత్యక్ష వారసులు లేని మహిళా రాజకీయ నాయకులు కూడా మేనల్లుళ్లను తమ వారసులుగా ఎంచుకున్నారని గుర్తు చేశారు.
Shashi Tharoor | సంస్కరణలు అవసరం..
వారసత్వ రాజకీయాలను దేశం పక్కనపెట్టి సమర్థులైన వారిని నాయకులుగా ఎన్నుకునే సమయం ఆసన్నమైందని శశిథరూర్ అన్నారు. ఇందుకోసం చట్టబద్ధ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. పదవీకాలంపై పరిమితులు విధించడంతో పాటు ప్రతి పార్టీలో అర్థవంతమైన అంతర్గత ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అలాగే మెరిట్ ఆధారంగా నాయకులను ఎన్నుకునేలా ఓటర్లకు అవగాహన కల్పించడానికి, అధికారం ఇవ్వడానికి సమిష్టి ప్రయత్నం అవసరమని థరూర్ అభిప్రాయపడ్డారు. భారత రాజకీయాలు కుటుంబ సంస్థగా ఉన్నంత కాలం ప్రజాస్వామ్యం నిజమైన వాగ్దానం – ‘ ప్రజలచే, ప్రజల కోసం ఎన్నికైన ప్రజల ప్రభుత్వం’ – పూర్తిగా సాకారం కాలేదన్నారు.
