అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Chevella Accident | బస్సులో ప్రయాణిస్తున్న వారిపైకి కంకర లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ఎన్నో ఆశలతో రోజును ప్రారంభించిన వారి జీవితాలను లారీ కబళించింది. ఉదయం పూట వివిధ పనుల నిమిత్తం వెళ్తున్న తమ వారు ఇక తిరిగి రాని లోకాలకు వెళ్లారని తెలియడంతో వారి కుటుంబ సభ్యులు గుండెలవిసెలా రోదిస్తున్నారు. చేవెళ్లే రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 21కు చేరింది.
రంగారెడ్డి (Rangareddy) జిల్లాలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సు (RTC Bus)ను కంకర లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 21 మంది చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్‌కు తీసుకువెళ్లారు.
Chevella Accident | కంకరలో కూరుకుపోవడంతో..
బస్సును కంకర లారీ ఢీకొన్న తర్వాత అందులోని కంకర బస్సుపై పడింది. ప్రయాణికులు కంకరలో కూరుకుపోయారు. దీంతో ఊపిరాడక పలువురు మృతి చెందారు. పోలీసులు మూడు జేసీబీల సాయంలో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీసి ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Chevella Accident | విద్యార్థులు, ఉద్యోగులు
తాండూరు నుంచి హైదరాబాద్ (Hyderabad) వెళ్తున్న బస్సును కంకర లారీ ఢీకొంది. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. అందులో ఉద్యోగులు, విద్యార్థులు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేసేవారు, వివిధ కాలేజీల్లో చదివే వారు ఆదివారం కావడంతో స్వగ్రామాలకు వచ్చారు. సోమవారం తిరిగి వెళ్తుండగా.. ప్రమాదం చోటు చేసుకుంది. కాగా సహాయక చర్యలు చేపడుతున్న సమయంలో జేసీబీ ఎక్కడంతో చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ గాయపడ్డారు.
Chevella Accident | విచారం వ్యక్తం చేసిన సీఎం
రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారిని హైదరాబాద్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు ఘటనా స్థలానికి చేరుకోవాలని సూచించారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు.
Chevella Accident | పలువురి దిగ్భ్రాంతి
చేవెళ్ల రోడ్డు ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం సైతం ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
