Homeక్రైంBengaluru Stampede | తొక్కిసలాట ఘటనలో 10కి చేరిన మృతుల సంఖ్య..

Bengaluru Stampede | తొక్కిసలాట ఘటనలో 10కి చేరిన మృతుల సంఖ్య..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bengaluru Stampede | తొలి ఐపీఎల్ ట్రోఫీతో బెంగుళూరు(Bangaluru) అడుగుపెట్టిన ఆర్సీబీ(RCB) జట్టు సభ్యులకు ఘన స్వాగతం పలుకుతూ నిర్వహించిన విక్టరీ పరేడ్​లో అపశృతి చోటు చేసుకోవ‌డంతో అంతా విషాదం నెల‌కొంది. ఎంతో స‌ర‌దాగా విక్టరీ ప‌రేడ్ జ‌రుపుకోవాల‌ని ఆర్సీబీ ఆట‌గాళ్లు భావించారు. కానీ చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy stadium) వద్ద జరిగిన తొక్కిసలాటలో ప‌ది మందికి పైగా అభిమానులు మృతి చెందారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మరికొందరు అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన అభిమానులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Bengaluru Stampede | తీవ్ర విషాదం

అభిమానులను, పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జి చేశారు. దీంతో చిన్న స్వామి స్టేడియం దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ట్రాఫిక్‌ సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్న బెంగళూరు సిటీకి ఈ విక్టరీ పరేడ్‌ తీవ్ర అంతరాయం కలిగిస్తుందని భావించి, విక్టరీ పరేడ్‌కు (Victory parade) అనుమతి నిరాకరించారు. చిన్నస్వామి స్టేడియంలో సెలబ్రేషన్స్‌ నిర్వహణకు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలోనే బెంగుళూరు హోం గ్రౌండ్ చిన్న స్వామి స్టేడియంలో ఆర్సీబీ (RCB) జట్టు సభ్యులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్టేడియం లోపలికి ఒక్కసారిగా వెళ్లేందుకు అభిమానులు దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పడంతో అభిమానులు ఒకరిపై ఒకరు పడ్డారు. ఊపిరి ఆడక ప‌ది మందికి పైగా మృతి చెందారు. దీనిపై కర్ణాటక డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఆర్సీబీ ప‌రేడ్‌ని సంతోషంగా వీక్షించాల్సిన సమయంలో ఇలా జరగడంపై ఆయన బాధపడ్డారు. మృతుల‌కు ఆయన సంతాపం తెలిపారు. ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు. ద‌య‌చేసి అంద‌రూ సుర‌క్షితంగా ఉండాల‌ని నేను విజ్ఞ‌ప్తి చేస్తున్నాను అని శివ‌కుమార్ ఎక్స్‌లో రాసుకొచ్చారు.

Bengaluru Stampede | బాధితులను పరామర్శించిన సీఎం

తొక్కిసలాటలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah)పరామర్శించారు. క్షతగాత్రులకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆయన సూచించారు.