అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Trump War | ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య నెలకొన్న టారిఫ్ వార్(Tariff war)కు తాత్కాలిక బ్రేక్ పడింది. సుంకాలను గణనీయంగా తగ్గించుకునేందుకు యూఎస్(US), చైనా ఒక అవగాహనకు వచ్చాయి. దీంతో స్టాక్ మార్కెట్లు ఊపిరి పీల్చుకుంటున్నాయి.
తమపై అధిక సుంకాలు విధిస్తున్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) టారిఫ్ వార్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. వాణిజ్య లోటును తగ్గించడం, దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించడం లక్ష్యాలుగా అమెరికా గతనెల(Last month) 2వ తేదీన దాదాపు అన్ని దేశాలపై పదిశాతానికిపైగా రెసిప్రోకల్ టారిఫ్‌లు విధించింది. చైనా(China)పై 34 శాతం సుంకాలు విధించడంతో ఆ దేశం సైతం దూకుడుగా వ్యవహరించి అమెరికాపై అదనపు సుంకాలు బాదింది. దీంతో రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్(Trade war) ముదిరింది. ఏప్రిల్ తొమ్మిదిన చైనానుంచి వచ్చే వస్తువులపై రెసిప్రోకల్ టారిఫ్స్‌ను ట్రంప్ 104 శాతానికి పెంచారు. దీనికి ప్రతి స్పందనగా అమెరికానుంచి దిగుమతి(Imports) అయ్యే వస్తువులపై చైనా 84 శాతం అదనపు సుంకాలను విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇలా ఇరుదేశాలు క్రమంగా సుంకాలను పెంచుకుంటూ పోయాయి. యూఎస్ టారిఫ్(US Tariff)లు 145 శాతానికి చేరగా.. చైనా సుంకాలు 125 శాతానికి చేరాయి. ఈ చర్యలు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపాయి. అమెరికా స్టాక్ మార్కెట్(Stock market) తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యింది. ఈ నేపథ్యంలో వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు ఇరు దేశాలు ఇటీవల ప్రయత్నాలు మొదలుపెట్టాయి. స్విట్జర్లాండ్(Switzerland)లోని జెనీవాలో ఇరు దేశాల ప్రతినిధులు చర్చించి, టారిఫ్‌లు తగ్గింకోవడంపై ఓ అవగాహనకు వచ్చారు. ప్రస్తుతం ఉన్న సుంకాలను 115 శాతం తగ్గించుకోవడానికి అంగీకారం కుదిరింది. దీంతో చైనా వస్తువులపై అమెరికా విధిస్తున్న సుంకాలు 145 శాతంనుంచి 30 శాతానికి, అమెరికా వస్తువులపై చైనా విధిస్తున్న టారిఫ్‌లు 125 శాతంనుంచి 10 శాతానికి తగ్గనున్నాయి. ఇది బుధవారం(Wednesday) నుంచి అమలులోకి రానుంది. 90 రోజుల(90 days) పాటు అమలులో ఉండనుంది. కాగా టారిఫ్‌ల విషయంలో ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగనున్నాయి.
Trump War | స్టాక్ మార్కెట్ పరుగులు..
యూఎస్, చైనాల మధ్య సుంకాల తగ్గింపుపై అవగాహన కుదరడంతో రెండు దేశాల స్టాక్ ఎక్స్ఛేంజీలు పరుగులు తీశాయి. డౌజోన్స్(Dow jones) ఫ్యూచర్స్ 2 శాతానికిపైగా లాభంతో ట్రేడ్ అవుతుండగా.. షాంఘై శాతం 0.81 లాభంతో ముగిసింది.