అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | హైదరాబాద్‌లో మరో బస్సు ప్రమాదం జరిగింది. సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సు (RTC Bus)ను డీసీఎం ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు.
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ (Rajendranagar Police Station) పరిధిలోని ఆరాంఘర్ చౌరస్తా సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం ఢీకొంది. శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. షాద్‌నగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న బస్సును డీసీఎం బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Hyderabad | లారీ దగ్ధం
శంషాబాద్ సిద్ధాంతి ఫ్లైఓవర్ (Shamshabad Siddhanthi Flyover)పై శుక్రవారం ఉదయం లారీ దగ్ధమైంది. హైదరాబాద్ బెంగుళూరు హైవే ఫ్లై ఓవర్ పై వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన డ్రైవర్ లారీని పక్కన ఆపాడు. అనంతరం ఫైర్ ఇంజిన్‌కు సమాచారం ఇచ్చాడు. అయితే అగ్ని మాపక సిబ్బంది రావడం ఆలస్యం కావడంతో స్థానికులు మున్సిపాలిటీకి చెందిన వాహనంతో మంటలను ఆర్పేశారు.
Hyderabad | వరుస ప్రమాదాలు
ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చేవెళ్ల వద్ద ఆర్టీసీ బస్సును కంకర లారీ ఢీకొనడంతో 19 మంది చనిపోయారు. అంతకు ముందు కర్నూల్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కాలిపోయి 19 మంది సజీవ దహనం అయ్యారు. ప్రైవేట్ ట్రావెల్స్, ఆర్టీసీ బస్సులు అని తేడా లేకుండా ప్రమాదాలకు గురి అవుతుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
