Homeజిల్లాలుకామారెడ్డిKamareddy Congress | కార్యకర్తలను సంప్రదించాకే డీసీసీ అధ్యక్షుడి నియామకం..

Kamareddy Congress | కార్యకర్తలను సంప్రదించాకే డీసీసీ అధ్యక్షుడి నియామకం..

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Congress | జిల్లాలోని ప్రతి నియోజకవర్గం, మున్సిపాలిటీ, వార్డులు సందర్శించి అట్టడుగు స్థాయి కార్యకర్తలతో సంప్రదించిన తర్వాతే కొత్త నాయకులను నియమిస్తారని ఏఐసీసీ (AICC) పరిశీలకుడు రాజ్​పాల్ కరోలా స్పష్టం చేశారు. మంగళవారం డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక కోసం పట్టణంలోని ఆర్ అండ్​బీ గెస్ట్ హౌస్​లో కామారెడ్డి నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

Kamareddy Congress | కైలాస్​కే అవకాశమివ్వాలని తీర్మానం..

ఈ సందర్భంగా ఏఐసీసీ అబ్జర్వర్ రాజ్​పాల్ కరోలా.. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, మండల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షుల అభిప్రాయాలను స్వీకరించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడిగా కైలాస్ శ్రీనివాస్ రావును తిరిగి ఎన్నిక చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.

Kamareddy Congress | అందరినీ కలుపుకుని వెళ్తాం..

అనంతరం రాజ్​పాల్ కరోలా (AICC Observer Rajpal Karola) మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కులం, మతం సంబంధం లేకుండా సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని అందరినీ కలుపుకుని పోతుందన్నారు. యువకులు, విద్యావంతులు, సైద్ధాంతిక నిబద్ధత కలిగిన వ్యక్తులకు ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.

అధ్యక్షుడి ఎన్నికలో ప్రతిఒక్కరి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటామన్నారు. తమ పర్యటన తర్వాత నియామకాలను ఖరారు చేయడానికి రాష్ట్ర నాయకత్వానికి నివేదికలు అందిస్తామన్నారు. ఎవరైనా అధ్యక్ష పదవి కావాలనుకునేవారు తమకు దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. అందరూ పాతవారినే కోరుకుంటే తిరిగి ఆయనని ఎన్నుకునే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు.

ఇతర అవకాశం కల్పించాకే మారుస్తాం: షబ్బీర్ అలీ

కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించిన కైలాస్​ శ్రీనివాసరావును తిరిగి నియమించాలని నియోజకవర్గం మొత్తం కోరిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ అన్నారు. శ్రీనివాసరావును మార్చాలని నిర్ణయిస్తే ఇతర మంచి అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు.

సంఘటన్ సృజన్ అభియాన్ (Sangathan Srujan Abhiyan) దేశవ్యాప్త కార్యక్రమమని, ఇది పార్టీని పటిష్టం చేయడానికి పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తించి వారికి పదవులు ఇవ్వడానికేనని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా యువత, మహిళలు, అణగారిన వర్గాల గొంతుక వినిపించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మహమ్మద్ ఇలియాస్, గ్రంథాలయ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.