అక్షరటుడే, వెబ్డెస్క్ : Madhya Pradesh | ఓ తండ్రి తన కూతురు బతికుండగానే అంత్యక్రియలు చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని విదిశాలో చోటు చేసుకుంది. ఆ తండ్రి తన కుమార్తెను అల్లారుముద్దుగా పెంచాడు. ఏ కష్టం రావొద్దని బాగా చదివించాడు.
అయితే ఆమె వారికి తెలియకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కూతురు కోసం ఆ కుటుంబం కంగారు పడింది. తమ బిడ్డకు ఏమైందని ఆందోళన చెందింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తమ కుమార్తె ప్రేమ వివాహం (Love Marriage) చేసుకున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో ఆ తండ్రి గుండె తట్టుకోలేకపోయింది. కుమార్తె చేసిన పనికి తీవ్ర వేదనకు గురైన ఆయన బతికుండగానే కన్న కూతురికి అంత్యక్రియలు చేశాడు.
Madhya Pradesh | పెళ్లికి ఒప్పుకోరని..
విదిశ పరిధిలోని చునావాలి (Chunawali) ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువతి ఓ అబ్బాయిని ప్రేమించింది. ఇద్దరి కులాలు వేరు కావడంతో కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోరని భావించింది. దీంతో ఇంట్లో నుంచి పారిపోయి అతడిని రహస్యంగా పెళ్లి చేసుకుంది. ఆమె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆమె కోసం గాలిస్తుండగా.. ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలిసింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె ఇలా చేయడాన్ని వారు సహించలేకపోయారు. చుట్టు పక్కల వారు సైతం మాటలతో వేధించడంతో వారు ఇంటి నుంచి బయటకు రాలేదు. ఈ క్రమంలో ఆ కుటుంబం ఓ నిర్ణయం తీసుకుంది.
Madhya Pradesh | దిష్టిబొమ్మకు అంత్యక్రియలు
ఇతర కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవడంతో తమ కూతురు చనిపోయిందని వారు భావించారు. ఈ మేరకు ఆమె దిష్టిబొమ్మకు అంత్యక్రియలు చేశారు. కుటుంబం బంధువులు, స్థానికులు పిండితో దిష్టిబొమ్మని తయారు చేశారు. ఆ తర్వాత అలంకరించి సంగీతం, ఉత్సవ ఏర్పాట్లతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. పాడెపై దిష్టిబొమ్మను పెట్టి శ్మశనానికి తీసుకు వెళ్లారు. అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు. మూడు రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా సోషల్ మీడియా (Social Media)లో వైరల్గా మారింది.