Homeఆంధప్రదేశ్Visakhapatnam | యూట్యూబ్​లో చూసి అత్తను చంపిన కోడలు

Visakhapatnam | యూట్యూబ్​లో చూసి అత్తను చంపిన కోడలు

విశాఖపట్నంలో ఓ మహిళను ఆమె కోడలు హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Visakhapatnam | సమాజంలో రోజు రోజుకు నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. చిన్న చిన్న కారణాలతో కొంతమంది హత్యలు చేస్తున్నారు. సొంత వారినే కడతేరుస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో శుక్రవారం రాత్రి ఓ మహిళ తన హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.

విశాఖపట్నం జిల్లా పెందుర్తి (Pendurti) మండలం వేపగుంట అప్పన్నపాలెంలోని వర్షిణి అపార్టుమెంట్‌లో జయంతి సుబ్రహ్మణ్యం కుటుంబంతో జీవిస్తున్నాడు. అతడికి భార్య లలితాదేవి (30), కుమారుడు, కుమార్తె, తల్లి కనకమహాలక్ష్మి(63) ఉన్నారు. అయితే అత్త కనకమహాలక్ష్మి చాధస్తంతో తనను వేధిస్తోందని లలితాదేవి పగ పెంచుకుంది. ఆమెను ఎలాగైనా హత్య చేయాలని ప్లాన్​ వేసింది. ఇందులో భాగంగా హత్య చేసి ఎలా తప్పించుకోవాలోనని యూట్యూబ్​ (Youtube)లో సెర్చ్​ చేసింది. ఈ మేరకు ముందుగానే పెట్రోల్​ కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంది. శుక్రవారం సాయంత్రం భర్త ఇంట్లో నుంచి వెళ్లగానే.. పిల్లలతో దొంగా పోలీసు ఆట ఆడుదామని చెప్పింది. పిల్లలను మరో గదిలోకి వెళ్లి దాక్కొమని చెప్పింది. అనంతరం కుర్చీలో కూర్చున్న అత్తను కట్టేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించింది. క్షణాల్లో మంటలు వ్యాపించి కనకమహాలక్ష్మి సజీవ దహనమైంది. ఆమె కేకలతో బయటకు వచ్చిన లలితాదేవి కుమార్తె అక్కడకు వచ్చింది. దీంతో ఆమెకు సైతం గాయాలు అయ్యాయి.

Visakhapatnam | ప్రమాదంగా చిత్రీకరించే యత్నం

అత్తను హత్య చేసిన లలితా దేవి ప్రమాదంగా చిత్రీకరించాలని ప్లాన్​ వేసింది. టీవీ పేలడంతో మంటలు వ్యాపించి అత్త చనిపోయిందని ఏడుస్తూ బయటకు వచ్చింది. దీంతో స్థానికులు వచ్చి సుబ్రహ్మణ్యానికి, పోలీసులకు ఫోన్​ చేసి విషయం చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.

Visakhapatnam | ఇలా దొరికిపోయింది..

పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించగా.. పెట్రోల్​ వాసన వచ్చింది. దీంతో హత్య కోణంలో వారు దర్యాప్తు చేశారు. ఈ మేరకు లలితాదేవి ఫోన్​ తీసుకొని పరిశీలించారు. యూట్యూబ్​లో హిస్టరీ చూడగా.. ఎలా హత్యలో చేయాలో అని ఆమె సెర్చ్​ చేసినట్లు గుర్తించారు. భార్య తీరుపై సుబ్రహ్మణ్యం సైతం అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు. నిత్యం విసిగిస్తోందని తానే హత్య చేసినట్లు ఆమె అంగీకరించడంతో అరెస్ట్​ చేశారు.

Visakhapatnam | పెరుగుతున్న నేరప్రవృత్తి

ప్రస్తుతం సమాజంలో నేర ప్రవృత్తి పెరుగుతుంది. చిన్న చిన్న కారణాలతోనే హత్యలు చేస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్​ఫోన్ (Smart Phone)​, ఓటీటీ (OTT)లు, వెబ్​ సిరీస్​లతో చెడిపోతున్నారు. వాటిని చూస్తుండటంతో తెలియకుండానే చిన్న పిల్లల్లో సైతం నేర ప్రవృత్తి అలవడుతోంది. చిన్న పెద్ద తేడా లేకుండా ఇటీవల హత్యలు చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

Must Read
Related News