Dandora Movie Review | నటీనటులు: శివాజీ Shivaji, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు
సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్.శాఖమూరి
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
సంగీతం: మార్క్ కె.రాబిన్
నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పనేని
దర్శకత్వం: మురళీకాంత్
కులం అనే కాన్సెప్ట్ నేపథ్యంలో సినిమా చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అటూ ఇటూ అయినా తేడా వచ్చేస్తుంది. అలాంటి సున్నితమైన కథతోనే దండోరా సినిమా రూపొంది నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా మెప్పించిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..
Dandora Movie Review | కథ:
తెలంగాణలోని తుళ్లూరు గ్రామంలో కుల వివక్ష లోతుగా పాతుకుపోయి ఉంటుంది. తక్కువ కులానికి చెందిన వ్యక్తి మరణిస్తే, ఊరి చివర ఉన్న బ్రిడ్జ్ వరకు మాత్రమే శవాన్ని తీసుకెళ్లి, అక్కడే అంత్యక్రియలు నిర్వహించడం అక్కడి సంప్రదాయం. అదే గ్రామానికి చెందిన శివాజీ (శివాజీ) అగ్రకులానికి చెందిన రైతు. అయితే ఆయన మరణించిన తర్వాత, కుల సంఘానికి చెందిన స్మశానవాటికలో దహనం చేయడానికి అనుమతించమని కుల పెద్దలు ఖరాఖండీగా తేల్చేస్తారు.
అసలు శివాజీని కుల పెద్దలు ఎందుకు బహిష్కరించారు? ఆ గ్రామంలో తక్కువ కులానికి చెందిన రవి (రవి కృష్ణ) హత్య వెనుక ఉన్నది ఎవరు? రవి మరణం గ్రామంలో ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? తండ్రి శివాజీతో కన్న కొడుకు విష్ణు (నందు) ఎందుకు దూరమయ్యాడు? వేశ్య శ్రీలత (బిందు మాధవి)తో శివాజీకి ఉన్న బంధం ఏంటి? శివాజీ అంత్యక్రియల సందర్భంగా తలెత్తిన సమస్యలు గ్రామంలో ఏ మార్పును తీసుకొచ్చాయి? అన్న ప్రశ్నలకు సమాధానాలే ఈ సినిమా కథ.
Dandora Movie Review | నటీనటలు పర్ఫార్మెన్స్
దండోరా సినిమాకు అసలైన హీరో శివాజీయే అని చెప్పాలి. ఆయన పాత్ర పరిచయం అయినప్పుడు ‘కోర్ట్’ సినిమాలోని మంగపతిని కంటిన్యూ చేసినట్టే అనిపించినా, కథ ముందుకు సాగేకొద్దీ వచ్చే మలుపులతో పాటు పాత్రలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ప్రతి సన్నివేశంతో ఆ పాత్రకు కొత్త డైమెన్షన్ జతకావడం ఆయన అనుభవజ్ఞుడైన నటుడిగా బలంగా నిలుస్తుంది. శివాజీ కుమారుడి పాత్రలో నందు చక్కగా నటించారు. పాత్రకు కావాల్సిన వేరియేషన్స్‌ను సమర్థంగా చూపించారు. నవదీప్ నటుడిగా ఉన్న పొటెన్షియాలిటీని చెప్పడానికి క్లైమాక్స్ సీన్ ఒక్కటే చాలు. అయితే ఆయన ట్యాలెంట్‌కు తగ్గంత బలమైన క్యారెక్టర్ మాత్రం ఇది కాదనే భావన కలుగుతుంది.
రవికృష్ణకు నటునిగా మరో మంచి అవకాశం ఇచ్చిన పాత్ర. క్యారెక్టర్ కొంతవరకు రొటీన్‌గా ఉన్నప్పటికీ, హీరో కటౌట్లో ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఇంటర్వెల్ ముందు వచ్చే ఆయన ఎమోషనల్ పెర్ఫామెన్స్ సినిమా హైలైట్స్‌లో ఒకటిగా నిలుస్తుంది. ఇప్పటివరకు సినిమాల్లో చూసిన వేశ్య పాత్రలకు భిన్నంగా, ఈ సినిమాలో బిందు మాధవి పోషించిన పాత్ర ప్రత్యేకంగా నిలుస్తుంది. చీరకట్టు నుంచి డైలాగుల వరకు అన్నింటినీ హుందాగా తీర్చిదిద్దారు. అయితే ఆమె డబ్బింగ్ మాత్రం కొంత మైనస్‌గా అనిపిస్తుంది. మౌనిక, మణిక, రాధ్య కీలక పాత్రల్లో తమ వంతు బాధ్యతను సమర్థంగా నిర్వర్తించారు.
Dandora Movie Review | టెక్నికల్ పర్ఫార్మెన్స్:
మార్క్ కే రాబిన్ అందించిన సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. పాటలకంటే ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా ఎఫెక్టివ్‌గా ఉండి సన్నివేశాలను బలంగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ వర్క్ కూడా అద్భుతంగా ఉంది. విజువల్స్ కథకు సహజత్వం తీసుకొచ్చాయి. సృజన చేసిన ఎడిటింగ్ కూడా పర్వాలేదనిపిస్తుంది.
ఫస్ట్ హాఫ్‌లో కొంత ల్యాగ్ ఉన్నట్టు అనిపించినా, అది పెద్దగా ఆటంకం కలిగించే స్థాయిలో ఉండదు. నిర్మాత బెన్నీ పనితీరు మెచ్చుకోదగ్గది. ఇలాంటి కథాంశాలతో సినిమాలు చేయడానికి బడ్జెట్ పెట్టాలంటే ధైర్యం కావాలి, ఆ విషయంలో ఆయన ముందడుగు వేశారు. దర్శకుడు మురళీకాంత్ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఒరిజినల్ అప్రోచ్‌తో సినిమాను తెరకెక్కించాడు. తన దృష్టిలో ఉన్న కథను చాలా నిజాయితీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడని చెప్పొచ్చు.
ప్లస్ పాయింట్స్:
శివాజీ నటన
సంగీతం
డైరెక్షన్
మైనస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్ ల్యాగ్
ఎడిటింగ్
లాజిక్ లేని సీన్స్
విశ్లేషణ:
కాలం మారినా, ఉన్నత చదువులు చదువుతున్నా కూడా కుల వివక్ష మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉందనే కఠిన నిజాన్ని దర్శకుడు మురళీకాంత్ ఈ సినిమాలో స్పష్టంగా చూపించారు. ఇలాంటి సున్నితమైన సామాజిక అంశాన్ని ఓవర్‌బోర్డ్ కాకుండా, డ్రైగా కూడా కాకుండా బ్యాలెన్స్ చేయడమే ఈ సినిమాకు పెద్ద బలం. కుల గజ్జి ఎంతటి దారుణాలకు దారి తీస్తుందో హృదయాన్ని తాకేలా ఆవిష్కరించారు.
ఫస్ట్ హాఫ్‌లో ప్రేమకథ, రొమాన్స్, కామెడీతో పాటు సామాజిక సమస్యను మెల్లగా నడిపించారు. సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా ఎమోషనల్‌గా మారి ప్రేక్షకులను కలిచివేస్తుంది. బిందు మాధవి పాత్ర, శివాజీలో వచ్చే మార్పు, కోర్ట్ సీన్, క్లైమాక్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయి. డైలాగ్స్ గట్టిగా తగిలేలా ఉండి, కుటుంబ భావోద్వేగాలతో పాటు సమాజానికి ఓ సందేశాన్ని బలంగా అందించే ప్రయత్నం చేశాయి. ఓవరాల్‌గా భావోద్వేగాలు, ఆలోచనలకు దారితీసే ముగింపుతో సినిమా గుర్తుండిపోయేలా నిలుస్తుంది. అన్ని భావోద్వేగాల మేళవింపుతో నడిపించిన మంచి కమర్షియల్ మూవీ దండోరా అని అనాల్సిందే.
రేటింగ్ : 3 /5