అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CI Suspended | దళిత యువకుడి లాకప్ డెత్ విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఇప్పటికే డీఎస్పీని బదిలీ చేయగా.. తాజాగా సీఐపై వేటు వేసింది.
కోదాడ రూరల్ సీఐ ప్రతాప్ లింగంను (Kodad Rural CI Pratap Lingam) సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. హుజుర్ నగర్ సబ్ జైల్లో (Huzurnagar sub-jail) రిమాండ్ ఖైదీ కర్ల రాజేష్ మృతి చెందడంతో సీఐపై చర్యలు చేపట్టారు. చిలుకూర్ ఎస్సై సురేష్‌ను వీఆర్‌కు అటాచ్ చేశారు. దళిత యువకుడి మృతి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. బీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు సైతం ఈ వ్యవహారంలో బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
CI Suspended | అసలు ఏం జరిగిందంటే?
మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పనిచేసే చడపంగు నరేష్ అనే వ్యక్తి సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాజేశాడు. లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను అదే పేరుతో ఉన్న ఇతరుల ఖాతాలో వేయించి సొమ్ము చేసుకున్నాడు. దీనిపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నరేష్‌తో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. చిలుకూరుకు చెందిన కె రాజేశ్‌కు సీఎంఆర్ఎఫ్ చెక్కు (CMRF cheque) మంజూరైంది. అయితే అదే పేరుతో కె (కర్ల) రాజేశ్ ద్వారా నరేశ్ డబ్బులు విత్‌డ్రా చేయించాడు. దీంతో కర్ల రాజేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
CI Suspended | జైల్లో అస్వస్థత
చిలుకూరు పోలీసులు ఈనెల 9న రాజేశ్‌ను అరెస్ట్ చేశారు. రిమాండ్ నిమిత్తం హుజూర్నగర్ సబ్ జైలుకు తరలించారు. ఈ నెల 14న రాత్రి అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజేశ్ చనిపోయాడు. అయితే పోలీసులు కొట్టడంతోనే రాజేశ్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ వ్యవహారం పెద్దది కావడంతో ప్రభుత్వం స్పందించింది. కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డిని గతంలోనే బదిలీ చేయగా.. తాజాగా సీఐ, ఎస్సైలపై చర్యలు తీసుకుంది.