అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | ట్రంప్ సుంకాల(Trump Tariffs) ప్రకటనతో ఆసియా స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. దీని ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా కనిపించింది. ఇప్పటికే యూఎస్ హెచ్ 1బీ వీసా ఫీజుల పెంపుతో ఇబ్బంది పడుతున్న మన మార్కెట్‌కు ఇది గుదిబండగా మారింది.
బ్రాండెడ్, పేటెంట్ పొందిన ఔషధాలు(Medicines), హెవీ డ్యూటీ ట్రక్కులు వంటి విస్తృత శ్రేణి వస్తువులపై ట్రంప్ అదనపు సుంకాలు విధించారు. ఇవి అక్టోబర్ ఒకటో తేదీనుంచి అమలులోకి రానున్నాయి. దీంతో ఫార్మా రంగం(Pharma sector)లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఐటీలో రక్తపాతం ఆగడం లేదు. శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 203 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 77 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 701 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ(Nifty) 72 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 50 పాయింట్లు లాభపడిరది. అక్కడినుంచి 239 పాయింట్లు పతనమైంది. చివరికి సెన్సెక్స్(Sensex) 733 పాయింట్ల నష్టంతో 80,426 వద్ద, నిఫ్టీ 236 పాయింట్ల నష్టంతో 24,654 వద్ద నిలిచాయి.
అన్ని రంగాల్లో రక్తపాతం..
దేశీయ స్టాక్ మార్కెట్‌లో అన్ని సెక్టార్లలో సెల్లాఫ్ కనిపించింది. బీఎస్‌ఈలో టెలికాం ఇండెక్స్ 2.69 శాతం, ఐటీ ఇండెక్స్(IT index) 2.43 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్ 2.34 శాతం,
హెల్త్‌కేర్ ఇండెక్స్ 2.14 శాతం, కమోడిటీ 1.91 శాతం, పీఎస్‌యూ బ్యాంక్, మెటల్ ఇండెక్స్‌లు 1.90 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.78 శాతం, పవర్ 1.42 శాతం, పీఎస్‌యూ ఇండెక్స్ 1.40 శాతం, యుటిలిటీ 1.33 శాతం, ఇన్‌ఫ్రా 1.19 శాతం, ఆటో ఇండెక్స్ 1.12 శాతం నష్టపోయాయి. స్మాల్ క్యాప్(Small cap) ఇండెక్స్ 2.05 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.96 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 1.12 శాతం నష్టాలతో ముగిశాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,041 కంపెనీలు లాభపడగా 3,100 స్టాక్స్ నష్టపోయాయి. 139 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 132 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 154 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 12 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 6 కంపెనీలు లోయర్ సర్క్యూట్(Lower circuit)ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల విలువ రూ. 7.50 లక్షల కోట్ల మేర ఆవిరయ్యింది.
Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 4 కంపెనీలు లాభాలతో ఉండగా.. 26 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎల్‌టీ 2.38 శాతం, టాటా మోటార్స్ 1.32 శాతం, ఐటీసీ 1.21 శాతం, రిలయన్స్ 0.39 శాతం లాభపడ్డాయి.
Top Losers : ఎంఅండ్‌ఎం 3.62 శాతం, ఎటర్నల్ 3.39 శాతం, టాటా స్టీల్ 2.81 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.75 శాతం, ఆసియా పెయింట్ 2.62 శాతం నష్టపోయాయి.