అక్షరటుడే, వెబ్డెస్క్ : Bathukamma | ప్రకృతిని ఆరాదిస్తూ జరుపుకునే గొప్ప వేడుక బతుకమ్మ. ఇది తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. భాద్రపదంలో మహాలయ అమావాస్య(Mahalaya Amavasya) నాడు ఎంగిలి పూలు పేరుతో ప్రారంభమయ్యే బతుకమ్మ ఉత్సవాలు.. ఆశ్వీయుజ మాసంలో వచ్చే దుర్గాష్టమి(Durga Ashtami)న సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి.
ప్రకృతిలో లభించే పూవులను వరుసలుగా పేర్చి బతుకమ్మగా తీర్చి చేసే పండుగిది. వాటిని మొదట ఇంట్లో.. ఆ తర్వాత వీధిలో లేదా ఆలయాల్లో నిలిపి దాని చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ, ఆటలు ఆడడం ఈ పండుగ ప్రత్యేకత. బతుకమ్మ పాటలలో పురాణ, ఇతిహాస కథలు, తెలంగాణ వీరుల కథలు, ఇతర అంశాలు ఉంటాయి.
Bathukamma | ఒక్కో రోజు ఒక్కో పేరుతో..
బతుకమ్మను ఒక్కో రోజు ఒక్కో పేరుతో పిలుస్తారు. ఆయా రోజుల్లో ప్రత్యేకమైన నైవేద్యాలను సమర్పిస్తారు. బతుకమ్మ ఆడిన తర్వాత మహిళలు వాయినాలు ఇచ్చుకోవడం సంప్రదాయంగా వస్తోంది. సాధారణంగా తొమ్మిది రోజుల బతుకమ్మ(Bathukamma) సంబురంలో కనిపించే ముఖ్యమైన ప్రసాదాల గురించి తెలుసుకుందామా..
మొదటి రోజు : ఎంగిలిపూల బతుకమ్మ
బతుకమ్మ మొదటి రోజు మహాలయ అమావాస్య నాడు వస్తుంది. పండుగకు ముందు ఆయా పుష్పాలన్నీ వివిధ కీటకాల పరాగ సంపర్కం కారణంగా ఎంగిలి పడ్డాయని తలచి మొదటి రోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మగా వ్యవహరిస్తారు. మొదటి రోజు నువ్వుల సద్దిని అందరితో పంచుకుంటారు.
రెండో రోజు : అటుకుల బతుకమ్మ
రెండో రోజు బతుకమ్మను అటుకుల బతుకమ్మగా పిలుస్తారు. ఈ రోజు అటుకుల ప్రసాదం చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు కలిపి అమ్మవారికి సమర్పించే నైవేద్యం ఇది.
మూడో రోజు : ముద్దపప్పు బతుకమ్మ
మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మగా వ్యవహరిస్తారు. ముద్ద పప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేస్తారు.
నాలుగో రోజు : నానబియ్యం బతుకమ్మ
నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ అంటారు. నానబెట్టిన బియ్యంను పాలు, బెల్లంతో కలిపి ఉడికించి ప్రసాదంగా తయారు చేస్తారు.
ఐదో రోజు : అట్ల బతుకమ్మ
ఐదోరోజు అట్ల బతుకమ్మగా పిలుస్తారు. ఆ రోజు అట్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.
ఆరో రోజు : అలిగిన బతుకమ్మ
ఆరో రోజు అలిగిన బతుకమ్మగా జరుపుకొంటారు. ఆ రోజు బతుకమ్మ పేర్చరు. కొందరు ఉపవాసం పాటిస్తారు.
ఏడో రోజు : వేపకాయల బతుకమ్మ
ఏడోరోజు వేపకాయల బతుకమ్మగా పిలుస్తారు. ఈ రోజు బియ్యంపిండిని వేయించి వేపపండ్లుగా తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
ఎనిమిదో రోజు : వెన్నెముద్దల బతుకమ్మ
ఎనిమిదో రోజు వెన్నెముద్దల బతుకమ్మగా వ్యవహరిస్తారు. నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి ముద్దలుగా చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
తొమ్మిదో రోజు : సద్దుల బతుకమ్మ
బతుకమ్మ నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజును సద్దుల బతుకమ్మ(Saddula Bathukamma)గా పెద్ద బతుకమ్మగా జరుపుకుంటారు. ఇది ప్రత్యేకమైనది. ఈ రోజున పెద్దపండుగగా జరుపుకుంటారు. చివరి రోజు బతుకమ్మలో గునుగు పూలు, తంగెడు పూలు తప్పనిసరిగా వినియోగిస్తారు. ఈ రోజు ఐదు రకాల నైవేద్యాలను చేస్తారు. సాధారణంగా పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్ రైస్, కొబ్బరన్నం, నువ్వులన్నం చేస్తారు. సత్తుపిండితో చేసిన ముద్దలను తప్పనిసరిగా ప్రసాదంగా స్వీకరిస్తారు.