అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cyclone Montha | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి తుపాన్‌గా మారింది. మొంథా తుపాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో తుపాన్ కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం 16 కిలోమీటర్ల వేగంతో దూసుకు వస్తోంది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపాన్ (Cyclone Montha)గా మారి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుపాన్ ప్రభావంతో సోమవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణ (Telangana)లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాయంత్రం వరకు రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుంది. రాత్రి సమయంలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయి. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, భువనగిరి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షం పడే ఛాన్స్ ఉంది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి.
Cyclone Montha | అతి భారీ వర్షాలు..
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. రోజంతా ముసురు పెడుతుందన్నారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలో సోమవారం రాత్రి నుంచి తేలికపాటి జల్లులు కురుస్తాయి. తుపాన్ ప్రభావంతో నగరంలో మంగళవారం, బుధవారం మోస్తరు వాన పడుతుంది. ఉష్ణోగ్రతలు (Temperatures) భారీగా పడిపోయి, చలితీవ్రత పెరుగుతుంది. రెండు రోజుల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుంది.
Cyclone Montha | అధికారుల అప్రమత్తం
మొంథా తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని తీర ప్రాంతాలపై అధికంగా ఉండనుంది. దీంతో అక్కడి ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. అధికారులకు సెలవులు రద్దు చేసింది. సహాయక చర్యల కోసం రూ.19 కోట్లు విడుదల చేసింది. తీర ప్రాంత మండలాల్లో సహాయక శిబిరాలను సిద్ధం చేశారు. పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు.
